బీజేపీలో నటి రేష్మాకు కీలక పదవి! | Reshma Rathore Wants To Contest For Mahabubabad Lok Sabha Seat | Sakshi
Sakshi News home page

ఆ పార్టీలో యువనటికి కీలక పదవి

Jul 14 2018 1:57 PM | Updated on Oct 8 2018 5:19 PM

Reshma Rathore Wants To Contest For Mahabubabad Lok Sabha Seat - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తనకు అవకాశం ఇస్తే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థిగా మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తానని టాలీవుడ్‌ నటి, ‘ఈ రోజుల్లో’ ఫేం రేష్మా రాథోడ్‌ అన్నారు. తనను యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నియమించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశమిస్తే తప్పకుండా వినియోగించుకుంటానని నటి ధీమా వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి రోజున ఆమె బీజేపీలో చేరిన విషయం విదితమే. ప్రజల సమస్యలతో పాటు స్థానిక అవసరాలేమిటో తెలుసుకునేందుకు పార్లమెంట్‌ పరిధిలోని నియోజకవర్గాల్లో పర్యటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆమె స్పష్టం చేశారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా శుక్రవారం హైదరాబాద్‌కు విచ్చేసిన సందర్భంగా ఆయనను కలుసుకుని ఘన స్వాగతం పలికిన వారిలో రేష్మ కూడా ఉన్నారు.

బీజేపీ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన హారితహారం, డబుల్‌ బెడ్రూమ్‌, ఇతర పథకాల అమలు సరిగా లేదని విమర్శించారు. 12,751 గ్రామ పంచాయతీలకుగానూ కేవలం 3,494 పంచాయతీలకు మాత్రమే కార్యదర్శులను నియమించారని గుర్తుచేశారు. హరితహారం కార్యక్రమం నిర్వహించాలని గ్రామ కార్యదర్శులకు బాధ్యత అప్పగించారనీ, అసలు అది ఎలా సాధ్యమవుతుందని టీఆర్‌ఎస్‌ సర్కార్‌ను ప్రశ్నించారు.

హరితహారం క్షేత్రస్థాయిలో మాత్రం కనిపించడం లేదన్నారు.  మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చెల్లించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయినా డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను కట్టించలేకపోయారని పేర్కొన్నారు. 1,121 కోట్ల రూపాయాలు పట్టణ గృహ నిర్మాణానికి, 190 కోట్ల రూపాయలు గ్రామీణ గృహ నిర్మాణానికి కేంద్రం ఇచ్చిందని ఈ సందర్భంగా యెండల గుర్తుచేశారు. ఇప్పటివరకు డబుల్‌ బెడ్రూం ఇళ్లకు 2,121 కోట్లు ఖర్చు చేశారని, ఇందులో 800 కోట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదని యెండల లక్ష్మీనారాయణ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement