కశ్మీర్‌ రాజకీయాల్లో కీలక మలుపు

Rebels Trouble for Mehbooba Mufti in Jammu Politics - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పీడీపీ అధినేత్రి, జమ్ము కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీకి భారీ షాక్‌ తగిలింది. పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ(పీడీపీ)లో గ్రూప్‌ రాజకీయాలు మొదలయ్యాయి. బీజేపీతో బ్రేకప్‌ను జీర్ణించుకోలేని ముగ్గురు పీడీపీ ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. మాజీ మంత్రి ఇమ్రాన్‌ అన్సారీ, మహ్మద్‌ అబ్బాస్‌ వానీ, వీరిద్దరితోపాటు మరో సీనియర్‌ నేత అబిద్‌ అన్సారీ.. మెహబూబాకు వ్యతిరేకంగా  తిరుగుబాటు జెండా ఎగరేశారు. మరికొందరిని కూడగలుపుకుని ఈ రెబల్స్‌ కొత్త పార్టీ ఏర్పాటు నిర్ణయానికి వచ్చినట్లు స్థానిక మీడియా కథనాలు ప్రచురిస్తోంది. 

మెహబూబాపై వ్యతిరేకగళం... సీనియర్‌ నేత అబిద్‌ అన్సారీ.. మెహబూబా ముఫ్తీ నాయకత్వంపై తొలి నుంచే వ్యతిరేకిస్తున్నారు. దీనికితోడు తాజా రాజకీయ పరిణామాలు ఆయన స్వరాన్ని పెంచేశాయి. మరోవైపు మాజీ మంత్రి ఇమ్రాన్‌ అన్సారీ కూడా సోమవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘పీడీపీని సమర్థవంతంగా నడపటంలో మెహబూబా దారుణంగా విఫలం అయ్యారు. అంతేకాదు తండ్రి ముఫ్తీ మెహబూబా కలలను కూడా ఆమె నాశనం చేశారు. పైగా ప్రభుత్వంలో కుటుంబ సభ్యుల జోక్యం ఎక్కువైపోయింది. పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీని కాస్త ఫ్యామిలీ డెమొక్రటిక్‌ పార్టీగా మార్చేశారు’ అని మాజీ మంత్రి ఇమ్రాన్‌ పేర్కొన్నారు. కాసేపటికే మరో ఎమ్మెల్యే మహ్మద్‌ అబ్బాస్‌ వానీ కూడా ఇమ్రాన్‌కు మద్ధతు ప్రకటించారు. బీజేపీతో విడిపోవటం.. ప్రభుత్వం కుప్పకూలిపోయి ముఫ్తీ రాజీనామా... మెహబూబా వైఫల్యాలని వారిద్దరూ బహిరంగంగా ప్రకటించారు. మరికొందరు అసంతృప్త నేతలతో కలిసి పీడీపీ, ఎన్సీ(నేషనల్‌ కాన్ఫరెన్స్‌) పార్టీలకు ప్రత్యామ్నాయ కూటమిని వీరు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది.   (ఆ అలవాటును మానుకోండి: బీజేపీ ఘాటు కౌంటర్‌)

బీజేపీతో టచ్‌లో?... అయితే మాజీ మంత్రి ఇమ్రాన్‌ అన్సారీ మాత్రం బీజేపీ అధినాయకత్వానికి టచ్‌లో ఉన్నట్లు ఓ జాతీయ మీడియా కథనం ప్రచురించింది. ‘ఇమ్రాన్‌ బీజేపీ చీఫ్‌ అమిత్‌ షాతో టచ్‌లో ఉన్నారు. మరికొందరు అసంతృప్త నేతలతో ఆయన బీజేపీలో చేరేందుకు ప్రణాళిక వేస్తున్నారు. మరోవైపు ఎన్సీ-కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కూడా  ఆకర్షించేందుకు బీజేపీ యత్నిస్తోంది’ అని ఆ కథనం సారాంశం. అయితే ఇమ్రాన్‌ మాత్రం ఆ కథనాన్ని తోసిపుచ్చారు. కశ్మీర్‌లో ఉగ్రవాదం పెరుగుదల, శాంతి భద్రతల హీనతను సాకుగా చూపి సంకీర్ణ ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలటంతో.. ప్రభుత్వం కుప్పకూలి ముఫ్తీ మెహబూబా సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. మొత్తం 89 మంది సభ్యులున్న జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీలో బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలు, పీడీపీకి 25 మంది ఎమ్మెల్యేలు ఉండగా, మ్యాజిక్‌ ఫిగర్‌కు కావాల్సిన సభ్యుల సంఖ్య 45.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top