జగన్‌ దృఢసంకల్పంతో పనిచేస్తున్నారు

Ram Madhav Interview With Sakshi

ప్రధాని మోదీ, సీఎం వైఎస్‌ జగన్‌ మధ్య సత్సంబంధాలు

రాష్ట్రాభివృద్ధికి ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారు

దేవాదాయ ఆస్తుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చాలా మంచిది

ఏడాది పూర్తిచేసుకున్న సీఎంకు అభినందనలు

‘సాక్షి’ ఇంటర్వ్యూలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌

(వెంకటేష్‌ నాగిళ్ల, సాక్షి ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో తీసుకువెళ్లేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ దృఢసంకల్పంతో పనిచేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోదీకి, సీఎం జగన్‌కు మధ్య మంచి సత్సంబంధాలు కొనసాగుతున్నాయని.. అక్కడి రాష్ట్ర ప్రజల కోసమే ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారని ఆయన చెప్పారు. అంతేకాదు.. కేంద్రంలో మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని మంచి నిర్ణయాలకు పార్లమెంట్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి మద్దతు లభిస్తోందని.. దీనిని తాము స్వాగతిస్తున్నామన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ, అఖండ మెజారిటీతో తొలిసారి ఏపీ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన వైఎస్‌ జగన్‌.. ఇద్దరూ ఏడాది పాలన పూర్తిచేసుకున్న నేపథ్యంలో రామ్‌మాధవ్‌ శుక్రవారం ‘సాక్షి’ ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏడాది పూర్తయిన సందర్భంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

► దేవదాయ ఆస్తుల విషయంలో సాధుసంతుల కమిటీ ద్వారా నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం సంతోషకరం. ఇది చాలా మంచి నిర్ణయం. అక్కడక్కడ కొన్ని వివాదాలు వస్తున్నా అవి పెద్దవి కావు. వాటిపై కొంచెం జాగ్రత్త వహించాలి.
► అన్నింటికీ ముఖ్యమంత్రిని తప్పుపట్టడం సరికాదు.
► విశాలమైన లక్ష్యాలను సాధించే క్రమంలో వాటిని కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్‌ చేయాలి.
► ఏపీ ప్రజల అభివృద్ధి కోసమే ప్రధాని మోదీ, సీఎం వైఎస్‌ జగన్‌ కలిసి పనిచేస్తున్నారు. ఏపీకి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి కేంద్రం పూర్తి మద్దతుగా నిలిచి అండదండలు అందిస్తుంది.
► రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలతోపాటు దానికి మించి ఏపీకి సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధాని చెప్పారు.
► 15వ ఆర్థిక సంఘం సైతం నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకునేందుకు వీలైనంత ఎక్కువ సాయం చేయాలని ఆలోచించింది.
► మేం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకమని భావించవద్దు. ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం.
► ఆంధ్ర రాష్ట్రం తక్కువ వనరులతో అవతరించింది. ఈ రాష్ట్రం అభివృద్ధికి కేంద్రం చేయూత తప్పనిసరి.
► ఆంధ్ర వాడిగా నా వంతుగా నేను ఏపీ అభివృద్ధి కోసం కృషిచేస్తా.
► రెండోసారి ప్రధాని అయిన తర్వాత ప్రధాని మోదీ.. అచ్ఛేదిన్‌ నినాదం నుంచి ఆత్మనిర్భర్‌ భారత్‌ వరకు ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. 
► కరోనా మహమ్మారిని ఎంతో ధీటుగా ఎదుర్కొన్నారు. 
► ఎక్కువ కాలం అధికారంలో ఉంటే వ్యతిరేకత పెరగడం సహజం.. కానీ, దీనికి భిన్నంగా ప్రధాని మోదీ రేటింగ్‌ 90శాతానికి పైగా ఉంది.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top