నిమిషాల్లోనే.. గందరగోళం.. వాయిదా!

Rajya Sabha was adjourned for the day - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్న తీరు ఏమాత్రం మారడం లేదు. ఇరుసభల్లోనూ వాయిదాల పర్వం యథేచ్ఛగా కొనసాగుతోంది. సభలు ప్రారంభమైన క్షణాల్లోనే వాయిదా పడుతుండటం గమనార్హం. దీంతో పలు విపక్ష పార్టీలు సభలో తమ గొంతు వినాలని ఎంతగా అభ్యర్థించినా.. పట్టించుకునే పరిస్థితి లేకుండా పోతోంది. ముఖ్యంగా విభజన హామీల అమలు విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన తీరని అన్యాయంపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు పార్లమెంటు లోపల, బయటా పోరాడుతున్న సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం అన్యాయాన్ని తప్పుబడుతూ.. వైఎస్‌ఆర్‌సీపీ లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ అవిశ్వాసానికి పలు విపక్ష పార్టీలు మద్దతు తెలిపినా.. సభ ఆర్డర్‌లో లేకపోవడంతో వరుసగా వాయిదా పడుతూ వచ్చింది. బుధవారం కూడా లోక్‌సభ నిమిషాలలోపే వాయిదా పడింది. దీంతో అవిశ్వాసంపై చర్చకు వీలులేకుండా పోయింది.

అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పెద్దలసభ బుధవారం అలా ప్రారంభమై.. అలా నిమిషాల్లో గురువారానికి వాయిదా పడింది.  సభ ప్రారంభం కాగానే.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, కాంగ్రెస్‌, టీడీపీ ఎంపీలు పోడియం వద్దకు వెళ్లి ఆందోళన నిర్వహించారు. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అంటూ నినదించారు. దీంతో చైర్మన్‌ వెంకయ్యనాయుడు సభను రేపటికి వాయిదా వేశారు. ఎలాంటి కార్యకలాపాలు సాగకుండానే పెద్దలసభ వాయిదాపడటంపై ప్రతిపక్ష సభ్యులు మండిపడుతున్నారు. సభను ఆర్డర్‌లోకి తీసుకొచ్చి.. సజావుగా నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని గుర్తుచేస్తున్నారు. అధికారపక్షం చొరవ తీసుకొని.. ఆందోళన చేస్తున్న ప్రతిపక్ష సభ్యులను సముదాయించి.. సభను సజావుగా నడిపించాల్సి ఉంటుందని, కానీ అధికారపక్షం నుంచి అలాంటి చొరవ కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top