రాహుల్‌.. ప్చ్‌!

Rahul Gandhi About Telangana Election Results - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచారం ఈసారి కూడా కాంగ్రెస్‌ అభ్యర్థులకు కలసిరాలేదు. మొత్తం 17 చోట్ల జరిగిన సభల్లో 27 నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ముథోల్, కామారెడ్డి, చార్మినార్, కొడంగల్, ఖమ్మం, పాలేరు, మధిర, సనత్‌నగర్, నాంపల్లి, భూపాలపల్లి, పరకాల, మంథని, ములుగు, హుజూరాబాద్, ఆర్మూరు, బాల్కొండ, జుక్కల్, నిజామాబాద్‌ రూరల్, పరిగి, గద్వాల, ఆలంపూర్, తాండూరు, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, కోదాడల్లో రాహుల్‌ ఎన్నికల ప్రచారం చేశారు.

ఈ స్థానాల్లో కేవలం పాలేరు, భూపాలపల్లి, మంథని, తాండూరు, ములుగు నియోజకవర్గాల అభ్యర్థులు మాత్రమే గెలుపొందారు. మేడ్చల్‌లో నిర్వహించిన భారీ బహిరంగసభకు రాహుల్‌తోపాటు సోనియాగాంధీ కూడా హాజరయ్యారు. అయినా ఇక్కడా కాంగ్రెస్‌ అభ్యర్థికి ఓటమి తప్పలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారం చేసిన 8 నియోజకవర్గాల్లో ఒక్క చోట కూడా కూటమి అభ్యర్థులు గెలుపొందలేదు. ఖమ్మం, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, సనత్‌నగర్, నాంపల్లి, కోదాడల్లో ఆయన ప్రచారం నిర్వహించారు.   

మెరుగైన ఫలితం ఆశించా!
తెలంగాణలో కాంగ్రెస్‌ మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తుందని ఆశించాను. ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్‌ల్లో కాంగ్రెస్‌ మంచి ఫలితాలు సాధించింది. తెలంగాణ, మిజోరంలోనూ ఇలాగే సత్ఫలితాలుంటాయని భావించాను.ఒక్కో రాష్ట్రంలో పరిస్థితి ఒక్కో రకంగా ఉంటుంది. డిమాండ్లు కూడా వేర్వేరుగా ఉంటాయి. వాటికి అనుగుణంగా మేం నడుచుకుంటాం. ఈ విషయంపై ఆయా రాష్ట్రాల నేతలతో మాట్లాడి వారి స్పందనను బట్టి ముందుకెళ్తాం
– రాహుల్‌ గాంధీ (ఢిల్లీలో మీడియా సమావేశంలో )

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top