రాధారవి రచ్చ, డీఎంకే నుంచి సస్పెన్షన్‌

 Radha Ravi suspended from DMK over slut shames Nayanthara - Sakshi

చెన్నై : హీరోయిన్‌ నయనతారపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీనియర్‌ నటుడు, డీఎంకే మాజీ ఎమ్మెల్యే రాధారవిపై ఆ పార్టీ సస్పెన్షన్‌ వేటు వేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు కోలీవుడ్‌లో దుమారం రేపుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. నయనతార నటించిన తాజా చిత్రం కొలైయుధీర్‌ కాలం. హారర్, థ్రిల్లర్‌ ఇతి వృత్తంతో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ శనివారం చెన్నైలోని ఓ హోటల్‌లో జరిగింది. సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లోనూ పాల్గొనని నయనతార ఈ చిత్ర ఆడియో విడుదలకు కూడా గైర్హాజరు అయ్యారు.  చదవండి....(నయనతారను చూస్తే దెయ్యాలే పారిపోతాయి)

నటుడు రాధారవి ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న నయనతారపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘నయనతార మంచి నటి. ఇంతకాలంగా సినీరంగంలో నాయకిగా కొనసాగడం పెద్ద విషయమే. అయితే ఆమె గురించి ప్రచారం కాని వార్తలే లేవు. అవన్నీ అధిగమించి నిలబడింది. తమిళ ప్రజలు ఎప్పుడూ ఒక విషయాన్ని నాలుగైదు రోజులే గుర్తుంచుకుంటారు. ఆ తరువాత మరచిపోతారు. నయనతార ఒక చిత్రంలో దెయ్యంగానూ నటించింది. మరో చిత్రంలో సీతగానూ నటించింది. ఇప్పుడు సీతగా ఎవరైనా నటించవచ్చు. ఇంతకుముందు అయితే సీతగా నటించడానికి కేఆర్‌ విజయనే ఎంపిక చేసుకునేవారు. ఇప్పుడు చూడగానే నమస్కరించాలనే వారు నటించవచ్చు, చూడగానే పిలివాలనిపించే వారు నటించవచ్చు. నయనతారను చూస్తే దెయ్యాలు పారిపోతాయి’  అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. అది చూసిన పలువురు రాధారవి వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.

దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ మండిపాటు
రాధారవి వ్యాఖ్యలపై దర్శకుడు, నయనతారతో సహజీవనం చేస్తున్నట్లు ప్రచారంలో ఉన్న విఘ్నేశ్‌ శివన్‌ మండిపడ్డాడు.

ఎవరు చర్యలు తీసుకుంటారు?
‘ఒక పారంపర్య కుటుంబం నుంచి వచ్చిన వారి నోటి నుంచి వచ్చిన వివాదాస్పద వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఎవరు చర్యలు తీసుకుంటారు? ఎవరు మద్దతు తెలుపుతారో అన్న విషయం గురించి నాకు పని లేదు. తనపై దృష్టిని మరల్చడానికే రాధారవి ఇలాంటి వ్యాఖ్యలకు పాల్పడ్డారు. బుర్రలేనివారు, అలాంటి చెత్త వ్యాఖ్యలకు నవ్వుకోవడం, చప్పట్లు కొట్టడంతో చింతలేదు. ఇంకా నిర్మాణం పూర్తి కాని చిత్రానికి ఇలాంటి కార్యక్రమం జరుగుతున్న విషయం మాకెవరికీ తెలియదు. ఇలాంటి కార్యక్రమాలకు పని పాటా లేని వారు వచ్చి అనవసర ప్రసంగం చేస్తుంటారు. ఇలా ఏం జరిగినా వారిపై ఏ సంఘం  చర్యలు చేపట్టేది లేదు. అందుకే ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనరాదని నిర్ణయించుకున్నాం.’   అన్నారు.

నటుడు రాధారవి వ్యాఖ్యలను గాయని చిన్మయి, నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌ తీవ్రంగా ఖండించారు. అలాగే రాధారవి వ్యాఖ్యలను సోదరి నటి రాధిక శరత్‌కుమార్‌ ఖండించడం విశేషం. కొలైయుధీర్‌ కాలం చిత్ర ఆడియో విడుదల కార్యక్రమంలో రాధారవి మాట్లాడిన వీడియోను నేను పూర్తిగా చూడలేదుగాని, నయనతార గురించి తను చేసిన వ్యాఖ్యలు సరికాదని రాధిక తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మరోవైపు రాధారవి వ్యాఖ్యలను  నడిగర్ సంఘం కూడా తప్పుబట్టింది. అయితే ఆయన మాత్రం తానేమీ తప్పుగా మాట్లాడలేదని వివరణ ఇచ్చినా... వివాదం మాత్రం సద్దుమణగలేదు. మరోవైపు ఎన్నికల దృష్ట్యా డీఎంకే కూడా ఆచూతూచి వ్యవహరించింది. వివాదం పెద్దది కావడంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top