రె‘బెల్స్‌’

Protests rock Congress party across Telangana - Sakshi

కాంగ్రెస్‌ తొలిజాబితాపై ఆశావహుల అసంతృప్తి

అనుచరులతో సమావేశాలు... పలుచోట్ల తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలోకి

సాక్షి, హైదరాబాద్‌:కాంగ్రెస్‌పార్టీ తొలిజాబితాపై అసంతృప్తి, నిరసనలు మొదలయ్యాయి. సోమవారంరాత్రి విడుదల చేసిన 65 స్థానాల జాబితాలో చోటు దక్కని నేతలంతా ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నారు. కొందరు అనుచరులతో సమావేశాలు నిర్వహించి భవిష్యత్‌ కార్యాచరణను నిర్ణయించుకునే పనిలో పడగా, మరికొందరు పార్టీ అధిష్టానంపై తిరుగుబాటుబావుటా ఎగరవేసేందుకు సిద్ధమవు తున్నారు.

తొలిజాబితాలో ప్రకటించిన స్థానాలకుగాను 15–20 చోట్ల కాంగ్రెస్‌కు, కూటమి పార్టీలకు అసమ్మతి సెగ తగిలేట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్‌ టికెట్‌ కోసం చివరి క్షణం వరకు ఎదురు చూసిన నేతలంతా అధిష్టానం మొండిచేయి చూపడంతో ప్రత్యామ్నాయ పార్టీలను ఆశ్రయిస్తున్నారు. బీజేపీ, బీఎస్పీ, ఎన్సీపీ, ఫార్వర్డ్‌బ్లాక్‌ లాంటి పార్టీల బీ–ఫారాల మీద పోటీ చేయాలనే ఆలోచనలో ముందుకెళుతున్నారు. అయితే, కొందరు మాత్రం ఏ పార్టీలోకి వెళ్లకుండా తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో ఉండేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీ ప్రకటించిన 9 స్థానాల్లో కూడా అసంతృప్తి వ్యక్తమవుతుండటం గమనార్హం.

ఉమ్మడి జిల్లాలవారీగా ‘కూటమి మంటలు’ ఇలా!
కరీంనగర్‌ జిల్లా వేములవాడ టికెట్‌ను ఆది శ్రీని వాస్‌కు కేటాయించడంపై ఏనుగు మనోహర్‌రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మనోహర్‌రెడ్డి వర్గీయు లు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మనోహర్‌రెడ్డి బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. చొప్పదం డిలో మాజీ మంత్రి సుద్దాల దేవయ్య ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన కూడా రెబెల్‌గా బరిలో ఉండే అవకాశాలున్నాయి. సిరిసిల్ల స్థానాన్ని పెండింగ్‌లో పెట్టడంపై ఆ స్థానాన్ని ఆశిస్తు న్న కె.కె.మహేందర్‌రెడ్డి అసహనంతో ఉన్నారు.
వరంగల్‌ వెస్ట్‌ స్థానాన్ని టీడీపీకి కేటాయించడంపై డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం సాగుతోంది. లేదంటే ఇండిపెం డెంట్‌గా బరిలో నిలిచే అవకాశముంది. స్టేషన్‌ ఘన్‌పూర్‌లో మాజీమంత్రి విజయరామారావు వర్గం అసంతృప్తితో ఉంది. ఆయన కూడా త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. ఇక పాలకుర్తిలో సుధీర్‌రెడ్డి కూడా రెబెల్‌గా పోటీ చేయనున్నారు.
♦  గ్రేటర్‌ పరిధిలోని శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే ఎం.భిక్షపతియాదవ్‌ రెబెల్‌గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించిన ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. మరోవైపు ఇదే స్థానంలో టీడీపీ టికెట్‌ను భవ్య ఆనంద ప్రసాద్‌కు కేటాయించడంపై సొంత పార్టీ నేతలే ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ టికెట్‌ ఆశించిన మొవ్వా సత్యనారాయణ అనుచరులు మంగళవారం సాయంత్రం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ ముందు హల్‌చల్‌ చేశారు. పార్టీ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోకుంటే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేసేందుకు మొవ్వ సత్యనారాయణ సమయాత్తం అవుతున్నారు. కంటోన్మెంట్‌లో సర్వే సత్యనారాయణ అల్లుడు క్రిశాంక్‌ రెబల్‌గా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అక్కడ టికెట్‌ ఆశించి భంగపడిన టీపీసీసీ కార్యదర్శి గణేశ్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నానని, ఇండిపెండెంట్‌గా బరిలో దిగుతున్నానని ప్రకటించారు. ముషీరాబాద్‌లో నగేశ్‌ ముదిరాజ్‌ కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పాలమూరు జిల్లాలో టీడీపీకి కేటాయించిన మక్తల్, మహబూబ్‌నగర్‌ స్థానాల్లో కాంగ్రెస్‌ నేతలు నామినేషన్లు వేయాలనే ఆలోచనలో ఉన్నారు. మక్తల్‌లో శ్రీహరి, మహబూబ్‌నగర్‌లో సురేందర్‌రెడ్డి తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో ఉండే అవకాశాలున్నాయి.
మంచిర్యాల టికెట్‌ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే అరవింద్‌రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ తాను పోటీచేస్తానని అంటున్నారు. ఆయన కచ్చితంగా రెబెల్‌గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
♦  రంగారెడ్డి జిల్లా తాండూరు మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పార్టీకి రాజీనామా చేశారు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలున్నాయి. చేవెళ్లలో డీసీసీ మాజీ అధ్యక్షుడు పడాల వెంకటస్వామి, వికారాబాద్‌లో మాజీమంత్రి ఎ.చంద్రశేఖర్‌ కూడా రె‘బెల్స్‌’ మోగించాలనుకుంటున్నారు.
ఖమ్మం జిల్లా అశ్వారావుపేట టీడీపీకి కేటాయిం చగా కాంగ్రెస్‌ అభ్యర్థిగా సున్నం నాగమణి ఇప్పటికే నామినేషన్‌ దాఖలు చేశారు. కొత్తగూడెంలో ఎడవెల్లి కృష్ణ కూడా పోటీ చేసే అవకాశాలున్నాయి.
నల్లగొండ జిల్లా కోదాడ స్థానాన్ని పద్మావతికి కేటాయించగా, కూటమి పక్షాన టికెట్‌ ఆశించిన బొల్లం మల్లయ్యయాదవ్‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. సోమవారమే తన అనుచరులతో సమావేశమైన ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సూర్యాపేట టికెట్‌ ఆశించిన పటేల్‌ రమేశ్‌రెడ్డి నిర్ణయం ఉత్కంఠను రేకెత్తిస్తోంది. రెబల్‌గా ఆయన బరిలో ఉంటారా.. లేదా అధిష్టానం చెప్పినట్టు ఎంపీ బరిలో ఉంటారా అన్నది తేలాల్సి ఉంది.
నిజామాబాద్‌ జిల్లాలో బాన్సువాడ, జుక్కల్‌ స్థానాల్లో రెబెల్‌ అభ్యర్థులు బరిలో ఉండే అవకాశాలు ఉన్నాయి.

కాంగ్రెస్‌ పార్టీపై నమ్మకం ఉంది: రమేశ్‌రెడ్డి
సూర్యాపేట: కాంగ్రెస్‌ పార్టీపై తనకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉందని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్‌ రమేశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేటలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాలో సూర్యాపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా తన పేరు ఉంటుందని నాయకులు, కార్యకర్తలు అనుకున్నారని, కానీ దామోదర్‌రెడ్డి పేరును ప్రకటించారన్నారు.

కొంతమంది నాయకుల మిస్‌గైడ్‌తోనే పేర్లలో కొన్ని మార్పులు జరిగాయని అనుకుంటున్నామని తెలిపారు. ఈ విషయంపై అధిష్టానం వద్దకు వెళితే నిజమైన కార్యకర్తలు, నాయకులకు న్యాయం చేస్తామని రాహుల్‌ హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ నెల 15న జిల్లా కేంద్రంలో కార్యకర్తలు, నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించనున్నట్లు చెప్పారు.

కన్నీరు పెట్టిన పటేల్, కుటుంబీకులు..
మంగళవారం సాయంత్రం ఢిల్లీ నుంచి సూర్యాపేటకు చేరుకున్న పటేల్‌ రమేశ్‌రెడ్డికి అభిమానులు, కార్యకర్తలు, నాయకులు భారీగా స్వాగతం పలికారు. ర్యాలీగా బయలుదేరి ఇంటికి చేరుకున్న పటేల్‌ను చూసి సతీమణి లావణ్య, తల్లిదండ్రులు, సోదరులు కన్నీరుమున్నీరయ్యారు. వీరిని చూసిన అభిమానులు, అనుచరులు కంటనీరు పెట్టుకున్నారు. అందరూ చూస్తుండగా.. పటేల్‌ వీరాభిమాని పట్టణానికి చెందిన శరత్‌ పటేల్‌ రమేశ్‌రెడ్డి నివాసం వద్ద ఒంటిపై డీజిల్‌ పోసుకున్నాడు. గమనించిన నాయకులు, కార్యకర్తలు వెంటనే శరత్‌ను అడ్డుకున్నారు.

కాంగ్రెస్‌ తొలి జాబితాలో పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పేరు లేకపోవడంతో మనస్తాపానికి గురైన ఆయన అభిమాని మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జనగామ జిల్లా నర్మెట మండలం అమ్మాపురం గ్రామానికి చెందిన యూత్‌ కాంగ్రెస్‌ నేత బొలగం రాజు పెట్రోలు బాటిల్‌తో జనగామ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయానికి చేరుకున్నాడు. పొన్నాలకు టికెట్‌ ఇవ్వాలి.. సీనియర్‌ నాయకుడికి మోసం చేస్తారా అంటూ పెట్రోలు పోసుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడున్నవారు అడ్డుకున్నారు. పొన్నాలకు టికెట్‌ వస్తుందని వారు భరోసా ఇచ్చారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top