పైలట్‌తో మంతనాలు.. రంగంలోకి ప్రియాంక | Priyanka Gandhi asks leaders to reach out to Sachin Pilot | Sakshi
Sakshi News home page

పైలట్‌తో మంతనాలు.. రంగంలోకి ప్రియాంక

Jul 16 2020 2:20 PM | Updated on Jul 16 2020 4:34 PM

Priyanka Gandhi asks leaders to reach out to Sachin Pilot - Sakshi

జైపూర్‌ : రాజస్తాన్‌ తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌ను తిరిగి సొంత గూటికి చేర్చుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం కసరత్తులు ప్రారంభించింది. ఇప్పటికే సోనియా, రాహుల్‌ గాంధీ పలువురు పార్టీ సీనియర్ల పైలట్‌ను బుజ్జగించే ప్రయత్నాలు చేసినా అవేవీ సఫలం కాలేదు. ఈ నేపథ్యంలో చివరి ప్రయత్నంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్మి ప్రియాంక గాంధీని అధిష్టానం రంగంలోకి దింపింది. అసమ్మతి కారణంగా పార్టీకి దూరమైన సచిన్‌ను వెనక్కి తీసుకువచ్చే బాధ్యతను ప్రియాంకకు సోనియా అప్పగించారు. దీంతో రంగంలోకి దిగిన ఆమె.. కాంగ్రెస్‌ సీనియర్లు, వ్యూహ రచనలో దిట్టగా పేరొందిన అహ్మద్‌ పటేల్‌, కేసీ వేణుగోపాల్‌లతో మంతనాలు ప్రారంభించారు. వెంటనే పైలట్‌తో మాట్లాడి ఆయన వెంట ఉన్న ఎమ్మెల్యేలను సైతం వెనక్కి తీసుకొచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు గురువారం వారిద్దరికీ బాధత్యలను అప్పగించారు. (సొంత గూటికి తిరిగి వచ్చే ఆలోచన ఉందా)

సచిన్‌కు కాంగ్రెస్‌ పార్టీ ఎన్నటికీ ద్రోహం చేయదని, ఇప్పటికీ ఆయన కోసం పార్టీ తలుపులు తెరిచే ఉంటాయని రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. దీంతో పైలట్‌ను వదులుకునేందుకు హస్తం నేతలు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. మరోవైపు పైలట్‌ తిరుగుబాటుతో రాజస్తాన్‌లో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సచిన్‌ వర్గంతో చేతులు కలిపిన 19 మంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్‌ పార్టీ ఇదివరకే నోటీసులు జారీచేసింది. పార్టీ శాసనసభాపక్ష సమావేశానికి గైర్హాజరుకావడాన్ని తీవ్రంగా భావించిన సీఎం.. దానికి గల కారణాలను వెంటనే తమ ముందుంచాలని ఆదేశించారు. మరోవైపు పార్టీలో నెలకొన్న తాజా పరిస్థితులపై పలువురు సీనియర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సచిన్‌పై పార్టీ అనుసరిస్తున్న విధానం సరైనది కాదని అభిప్రాయపడుతున్నారు. దీంతో నష్ట నివారణా చర్యలను చేపట్టిన కాంగ్రెస్‌ అధిష్టానం పైలట్‌తో సహా ఎమ్మెల్యేలను వెనక్కి తీసుకువచ్చేందుకు పావులు కదుపుతోంది. (19 మంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్‌ నోటీసులు) 

ఇదిలావుండగా రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న సంక్షోభం న్యాయస్థానికి చేరింది. అనర్హత నోటీసులపై సచిన్‌ పైలట్‌ వర్గం రాజస్తాన్‌ హైకోర్టును ఆశ్రయించింది. తమకు‌ జారీచేసిన నోటీసులను సవాలు చేస్తు 19 మంది ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై గురువారం సాయంత్రం న్యాయస్థానం విచారణ చేపట్టే అవకాశం ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement