సుశీల్‌కు ప్రశాంత్‌ కిషోర్‌ కౌంటర్‌ అటాక్‌

Prashant Kishor Targets Sushil Modi On Attacking Nitish kumar - Sakshi

పట్నా : పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై జనతాదళ్ (యునైటెడ్)లో విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్, పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ మధ్య మరోసారి మాటల యుద్ధం జరిగింది. సుశీల్‌ను ఉద్దేశిస్తూ.. కొంతమంది బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పట్ల కృతజ్ఞత చూపలేదని ఆరోపిస్తూ ప్రశాంత్ కిషోర్ శనివారం సుశీల్ కుమార్ పాత వీడియోను తన ట్విటర్‌లో షేర్‌ చేశారు.

'నితీష్ కుమార్ పార్టీలో కొంతమందికి ఎటువంటి గుర్తింపు లేకున్నా తనకున్న అధికారంతో వారికి గౌరవమైన స్థానాన్ని కల్పించారు. ఏ రాజకీయ ఎజెండా, సిద్ధాంతాలు లేకుండా కొంతమంది రాజకీయాల్లోకి వస్తారు. అధికార పార్టీని దెబ్బతీసేందుకు విపక్షాలకు లబ్ధి చేకూర్చే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఎన్నికల డేటాను సేకరించి విపక్ష పార్టీలకు చేరవేస్తూ రాజకీయంగా లబ్ధి చేస్తున్నారంటూ' సుశీల్‌ కుమార్‌ ఇంతకుముందు ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. దీనిపై ప్రశాంత్‌ కిషోర్‌ కౌంటర్‌ అటాక్‌ ఇస్తూ.. ప్రజలకు క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇవ్వడంలో సుశీల్ మోదీని మించినవారు ఎవరు ఉండరని  ఎద్దేవా చేశారు.

దీంతోపాటు ప్రశాంత్‌ సుశీల్ మోడీకి చెందిన పాత వీడియోను పోస్ట్ చేశారు. ప్రశాంత్‌ కిషోర్‌ షేర్‌ చేసిన వీడియోలో సుశీల్‌ కుమార్‌ నితీశ్‌ కుమార్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. ఆ వీడియోలో సుశీల్‌ మాట్లాడుతూ' నితీశ్‌ కుమార్‌ బీహారీ కాదని,17 సంవత్సరాల స్నేహం పేరుతో నితీశ్‌ బీజేపీకి ద్రోహం చేశారు. మోసం అనే పదం నితీశ్‌ డీఎన్‌ఏలో ఉంది కానీ బీహారీ ప్రజల్లో లేదని' తెలిపారు. అంతకుముందు జేడియూ సీనియర్ నేత పవన్ వర్మ నితీష్ కుమార్‌పై ట్విటర్‌లో మండిపడ్డారు. సీఏఏను వ్యతిరేకిస్తూనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్కడ బీజేపీతో పొత్తు ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించారు.

(విపక్షాలకు అనుకూలంగా ప్రశాంత్‌ కిషోర్‌: సుశీల్ మోదీ)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top