
పట్నా : ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ నాయకులు ప్రశాంత్ కిషోర్ పౌరసత్వ సవరణ బిల్లుపై తన అభిప్రాయాన్ని మరోసారి వ్యక్తీకరించారు. పౌరసత్వ బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ జరనుండగా.. ఆయన తన పార్టీ నేతలకు ఓ విజ్ఞప్తి చేశారు. ఈ బిల్లుకు మద్దతిచ్చే అంశంపై ఓ సారి ఆలోచించాలని కోరారు. 2015 ఎన్నికల సమయంలో జేడీయూ గెలుపుకు కృషి చేసిన వారి గురించి ఆలోచించాలంటూ ఆయన ట్విటర్‌లో ఓ పోస్ట్ చేశారు.
ప్రశాంత్ కిషోర్‌తో పాటు మరికొందరు జేడీయూ నేతలు కూడా పౌరసత్వ బిల్లుకు మద్దతు తెలుపడంపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ పునరాలోచన చేయాలని కోరుతున్నారు. అయితే ఇప్పటికే లోక్‌సభలో పౌరసత్వ బిల్లుకు మద్దతు తెలిపిన జేడీయూ.. రాజ్యసభలో కూడా అదే వైఖరితో ముందుకు సాగాలని పార్టీ ఎంపీలకు ఆదేశాలు జారీ చేసింది. రెండు రోజుల క్రితం కూడా ఈ బిల్లుపై ట్విటర్ వేదికగా స్పందించిన ప్రశాంత్ కిషోర్.. మతం ఆధారంగా పౌరసత్వ హక్కును కల్పించే బిల్లుకు జేడీయూ లోక్‌సభలో మద్దతు తెలుపడం నిరాశకు గురిచేసిందన్నారు.