కరోనా పోరులో రాజకీయ కొట్లాట

Prashant Kishor Fires On Nitish Kumar - Sakshi

పట్నా : దేశమంతా కరోనాపై కొట్లాడుతుంటే దీనికి భిన్నంగా బిహార్‌లో మాత్రం రాజకీయ విమర్శల వేడి పెరుగుతోంది. రెండు రోజుల క్రితం ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌పై మాటల దాడికి దిగిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ సైతం విమర్శలను ఎదుర్కొక తప్పలేదు. ప్రముఖ ఎన్నికల వ్యహాకర్త ప్రశాంత్‌ కిషోర్‌ మరోసారి నితీష్‌పై మాటల యుద్ధానికి దిగారు. రాజస్థాన్‌లోని కోటాలో చిక్కుకుపోయిన విద్యార్థులను తిరిగి తీసుకురావడానికి 300 బస్సులను ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ పంపడంపై నితీష్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ నింబంధనలు ఉల్లంఘిస్తూ బస్సులను పంపడం సరైనది కాదని విమర్శించారు. అయితే తాజాగా బిహార్‌ ప్రభుత్వం కూడా అదే తప్పు చేసింది.

రాజస్తాన్‌లోని కోటాలో చిక్కుకుపోయిన బిహార్‌ బీజేపీ ఎమ్మెల్యే కుమారుడికి కోసం ప్రభుత్వం స్పెషల్‌ పాస్‌ను జారీచేసింది. ఆయన్ని తీసుకుని వచ్చేందుకు ఓ వాహనాన్ని సైతం పంపింది. దీనిని ప్రశాంత్‌ కిషోర్‌ తీవ్రంగా తప్పుబట్టారు. ‘ఇటీవల యూపీ ప్రభుత్వం ఇదే పని చేస్తే తప్పు అని విమర్శించారు. మరి తాజాగా మీరు చేసింది ఏంటీ నితీష్‌ జీ..?’ అని ట్విటర్‌ వేదికగా ప్రశ్నించారు. బీజేపీ ఎమ్మెల్యే కొడుకు కోసం లాక్‌డౌన్‌ ఆంక్షలను ఉల్లంఘిస్తారా? అని నిలదీశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వంపై కూడా నితీష్‌ ఆరోపణలకు దిగుతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్నపేదలను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందంటూ ప్రధాని మోదీపై విమర్శలు చేస్తున్నారు. (యూపీ ప్రభుత్వ తీరుపై బిహార్‌ సీఎం ఆగ్రహం)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top