ఓట్లు మావి పాలన మీది ఇక నడవదు!

Prakash Ambedkar And Asaduddin Owaisi Alliance In Maharashtra Election - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘ఓట్‌ హమారా రాజ్‌ తుమారా, నహీ చలేగా నహీ చలేగా’ అనే నినాదం 1980వ దశకంలో దళిత నాయకుడు కాన్షీరాం బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ నినాదం మళ్లీ మహారాష్ట్ర ఎన్నికల్లో బాగా వినిపిస్తోంది. భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ మనవడు ప్రకాష్‌ అంబేడ్కర్‌ ఏర్పాటు చేసిన ‘వంచిత్‌ బహుజన్‌ అఘాది’ అనే సంకీర్ణపక్షం ఈ నినాదాన్ని మళ్లీ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది. అఖిల భారత మజ్లీస్‌ ఏ ఇత్తెహాద్‌ ఉల్‌ ముస్లిమీన్‌ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీతో కలసి ప్రకాష్‌ అంబేడ్కర్‌ ఏర్పాటు చేసిన ఈ సంకీర్ణ సంస్థ మహారాష్ట్రలోని 48వ లోక్‌సభ సీట్లకు పోటీ చేస్తోంది. 

మహారాష్ట్రలో దళితుల సంక్షేమం కోసం అనేక దళిత సంఘాలు పుట్టుకొచ్చి అనేక సామాజిక ఉద్యమాలను నిర్వహించాయి. సామాజిక ఉద్యమాల ద్వారా అంతో ఇంతో విజయం సాధించిన ఈ సంస్థలు, సంఘాలన్నీ రాజకీయంగా విజయం సాధించలేక పోయాయి. ఇందుకు కారణాలు రెండు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎప్పటికప్పుడు దళిత నాయకులను ప్రలోభ పెట్టి పార్టీలోకి తీసుకోవడం, తమకు మద్దతిచ్చినట్లయితే దళితుల ఎజెండాను అమలు చేస్తామంటూ ఆశచూపించడం ఒక కారణమైతే, రాజకీయంగా చక్రం తిప్పగల దళిత నాయకుడు ఎదిగిరాక పోవడం మరో కారణం. 

‘ఆల్‌ ఇండియా బ్యాక్‌వర్డ్‌ అండ్‌ మైనారిటీస్‌ కమ్యూనిటీ ఎంప్యాయీస్‌ ఫెడరేషన్‌’కు చెందిన వివిధ విభాగాలు, పలు బౌద్ధ సంఘాలు, 19వ శతాబ్దంలో సంఘ సంస్కర్త జ్యోతిరావు ఫూలే ఏర్పాటు చేసిన సత్యశోధక్‌ గ్రూపులు దళితుల కోసం పలు సామాజిక ఉద్యమాలు నిర్వహించాయి. రాజకీయంగా మాత్రం తగిన ప్రాధాన్యతను సాధించలేక పోయాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌తోనే లేదా బీజేపీ–శివసేన కూటమితో కలిసి పోవడం వల్ల ఎన్నికల్లో దళిత పార్టీలు సొంత అస్థిత్వాన్ని నిలబెట్టుకోలేక పోయాయి. 2007లో యూపీలో అధికారంలోకి వచ్చిన మాయావతి నాయకత్వంలోని బహుజన సమాజ్‌ పార్టీ, ఆ ఎన్నికల ద్వారా మహారాష్ట్రలో కూడా పట్టు సాధించగలిగింది. అయితే 2014లో నరేంద్ర మోదీ నాయకత్వాన రాష్ట్రంలో వీచిన బీజేపీ–శివసేన కూటమి ప్రభంజనంలో ఆ పట్టును పూర్తిగా కోల్పోయింది. 

ఈ నేపథ్యంలోనే ప్రకాష్‌ అంబేడ్కర్‌ 1915లో కొత్త కూటమితో ప్రజల్లోకి వచ్చారు. అంతకుముందు ఆయన బహుజన్‌ మహాసంఘ్, రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా’ పార్టీల తరఫున దలితుల కోసం పోరాడారు. ఈ కొత్త కూటమి కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌–నేషనల్‌ కాంగ్రెస్‌ కూటమితో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తుందంటూ తొలుత వార్తవు వెలువడ్డాయి. అయితే ఆ పార్టీలతో అంటకాగకపోవడమే ‘కస్టాల్లో కలిసివచ్చిన మేలు’గా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరాఠాలో అంతగా బలం లేకపోయినప్పటికీ ‘వంచిత బహుజన అఘాది’కి అక్కడ ఏఐఎంఐఎంకున్న బలం ఉపకరిస్తుందని, ఈసారి సంకీర్ణ కూటమికి ఆరు శాతం ఓట్లు సాధించే అవకాశం ఉందని రాజకీయ పండితులు తెలియజేస్తున్నారు. వారి అంచనాలు నిజమయితే పలు లోక్‌సభ సీట్లలో బీజేపీ–కాంగ్రెస్‌ విజయావకాశాలపై ప్రభావం చూపడమే కాకుండా బహుజన పార్టీ రెండు, మూడు సీట్లను గెలుచుకునే అవకాశం కూడా ఉంది. అప్పుడు పార్టీ బలోపేతానికి అదే నాంది కాగలదు. ప్రకాష్‌ అంబేడ్కర్‌ అకోలా, షోలాపూర్‌ స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా బహుజన సమాజ్‌ పార్టీ షోలాపూర్‌ నుంచి తన అభ్యర్థిని ఉపసంహరించుకుంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top