
కరీంనగర్: ‘తెలంగాణ కోసం అమరుడైన పోలీసు కిష్టయ్య కుటుంబానికే ఇప్పటివరకు డబుల్ బెడ్రూం ఇల్లుకు గతి లేదు.. ఇక పేదలకు ఎప్పుడు ఇస్తవ్ కేసీఆర్’అని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కరీంనగర్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మాటల గారడీతో ప్రజలను మభ్యపెడుతున్న కేసీఆర్‌ను ప్రగతి భవన్ నుంచి తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయని జోస్యం చెప్పారు.
మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు కలిసి 2015 అక్టోబర్ 22న ముగ్గుపోసిన పోలీసు కిష్టయ్య కుటుంబం ఇల్లుకే ఇంకా అతీగతీలేదని, ఇంకా అమరులకేంజేస్తావని నిలదీశారు. రూ. కోట్లు కుమ్మరించి అతికష్టంమీద గెలిచిన సింగరేణి ఫలితాలను చూసి విర్రవీగద్దని, ప్రతిపక్షాలను చులకన చూసి అహంకార పూరితంగా మాట్లాడటం తగదని అన్నారు.