యూపీలో జంపింగ్‌ జపాంగ్‌లు | Political Leaders Changes Offering Parties in Uttar Pradesh | Sakshi
Sakshi News home page

యూపీలో జంపింగ్‌ జపాంగ్‌లు

Mar 30 2019 9:37 AM | Updated on Mar 30 2019 9:37 AM

Political Leaders Changes Offering Parties in Uttar Pradesh - Sakshi

ఇది జంపింగ్‌ల కాలం.. అదేనండీ ఎన్నికల సీజన్‌ కదా.. నేతలు ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి దూకేయడం చాలా కామన్‌. దేశంలోనే అత్యధిక సంఖ్యలో లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌ ఇందుకు భిన్నమేమీ కాదు. ఇక్కడ అత్యధిక స్థానాలు గెలుచుకోవడం ఇప్పుడు బీజేపీకి పెద్ద సమస్యగా మారిపోయింది. సిట్టింగ్‌లకు సీటు ఇవ్వనంటే చాలు.. ఏం ఫర్వాలేదు మేమిస్తామంటూ ఎస్పీ–బీఎస్పీ కూటమి ఊరిస్తోంది. బీజేపీ ఇప్పటి వరకు 61 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ క్రమంలో 12 మంది సిట్టింగ్‌లను మార్చేసింది. జాబితా వెలువడి కొన్ని రోజులు కూడా కాకముందే వీరిలో నలుగురు పార్టీ మారిపోయారు. అలహాబాద్‌ ఎంపీ శ్యామా శరణ్‌ ఎస్పీ తరఫున ‘బండా’ నుంచి టికెట్‌ సాధించుకోగా.. బెహ్రయిచ్‌ ఎంపీ సావిత్రీ బాయి ఫూలేకు కాంగ్రెస్‌ అదే స్థానపు టికెట్‌ ఇచ్చింది.

హర్దోయి ఎంపీ అన్షుల్‌ వర్మ కూడా  పార్టీని వీడటమే కాక బీజేపీ దళిత వ్యతిరేకి అని విమర్శించి మరీ ఎస్పీలో చేరిపోయారు. దళితుల్లో వర్మకు ఉన్న ఫాలోయింగ్‌ను దృష్టిలో ఉంచుకుని హర్దోయి స్థానాన్ని ఇచ్చేందుకు ఎస్పీ ప్రయత్నిస్తోంది. కాగా, ఈటావా ఎంపీ అశోక్‌ కుమార్‌ డోహ్రే గురువారమే రాహుల్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ జంపింగ్‌ జపాంగ్‌లకు సీట్లు ఇవ్వడంపై ఆయా పార్టీల్లో పెద్దగా వ్యతిరేకత కూడా లేకపోవడం గమనార్హం. ఈ ఫిరాయింపులు అధికార పార్టీ దుశ్చర్యలకు అద్దం పడుతున్నాయని అంటున్నారు వీరు. ఇంకోవైపు బలియా బీజేపీ ఎంపీ ఇటీవలే తన నియోజకవర్గ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. పార్టీ తనకు టికెట్‌ నిరాకరించడాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘నా తప్పేంటి? నాకు ఎందుకు టిక్కెట్‌ ఇవ్వలేదు? సమస్యల పరిష్కారానికి కృషి చేశాను. ఈ స్థానానికి ప్రకటించిన వ్యక్తికి  సామాన్యులతో సంబంధాలే లేవు’’ అని ధిక్కార స్వరం వినిపించారు. ఫతేపూర్, ఖుషినగర్‌ స్థానాల్లోనూ ఇదే పరిస్థితి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement