సింధియా-చౌహాన్‌ భేటీ వెనుక ఆంతర్యం ఏమిటి?

Political Debate Over shivraj chouhan, jyotiraditya scindia meeting - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌పై జ్యోతిరాదిత్య సింధియా అసంతృప్తితో ఉన్నారా? మధ్యప్రదేశ్ సీఎం పదవి దక్కలేదన్న బాధ వెంటాడుతోందా? బీజేపీ సీనియర్‌ నేత శివరాజ్‌చౌహాన్‌తో సింధియా భేటీ ఆంతర్యం ఏంటి? మర్యాదపూర్వకంగా కలిశామని నేతలు చెబుతున్నా.. రాజకీయ కారణం ఉందన్న ప్రచారం రాష్ట్రంలో జోరుగా సాగుతోంది.

మధ్యప్రదేశ్‌ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాంగ్రెస్ యువనేత, ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా, మాజీ  సీఎం , బీజేపీ నేత శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ను కలువడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా భోపాల్‌కి దూరంగా ఉండే సింధియా సోమవారం సిటీకొచ్చారు. తన సన్నిహితులను కలిసిన తర్వాత చౌహాన్‌ ఇంటికి వెళ్లారు. దాదాపు 40 నిమిషాలపాటు వీరిద్దరూ చర్చలు జరిపారు. తర్వాత బయటకొచ్చిన చౌహాన్‌, సింధియా.. మర్యాదపూర్వకంగానే కలిశామని చెప్పారు. అనంతరం కారు వరకూ వెళ్లి సింధియాకు వీడ్కోలు పలికారు శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌.

మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌ ప్రస్తుతం దావోస్‌లో ఉన్నారు. ఆయన రాష్ట్రంలో లేని సమయంలో సింధియా.. చౌహాన్‌ను కలవడం హాట్‌ టాపిక్‌గా మారింది. మర్యాదపూర్వకంగానే కలిశామని ఇద్దరు నేతలూ చెబుతున్నా.. రాజకీయ నేపథ్యం ఉండే ఉంటుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. 15 ఏళ్ల బీజేపీ పాలనకు తెరదించి ఇటీవలే మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో కమల్‌నాథ్‌, జ్యోతిరాదిత్య సింధియా కీలకంగా వ్యవహరించారు. సీఎం పదవి కోసం ఇద్దరూ పోటీపడ్డారు. చివరికి సీనియర్‌ అయిన కమల్‌నాథ్‌ వైపే పార్టీ అధిష్ఠానం మొగ్గుచూపింది. ఇది సింధియా వర్గీయులను ఒకింత అసంతృప్తికి గురిచేసింది. కాంగ్రెస్‌ చీఫ్ రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన సింధియా.. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడాలని అనుచరులకు సర్దిచెప్పుకున్నారు. తాజాగా ఆయన చౌహాన్‌తో భేటీ అవడంతో ఈ విషయం మళ్లీ తెరమీదకి వచ్చింది. కాంగ్రెస్ అధిష్ఠానంపై అసంతృప్తి కారణంగానే సింధియా.. చౌహాన్‌ను కలిశారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

ఇతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలను అస్థిరపరచాలని బీజేపీ ప్రయత్నిస్తోందని.. ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్నదే త్వరలో మధ్యప్రదేశ్‌లోనూ జరిగే అవకాశం ఉందని కోల్‌కతాలో జరిగిన యునైటెడ్ ఇండియా ర్యాలీలో కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ శౌరి హెచ్చరించారు. ఒక్క సీటే తేడా అయినా, మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్ సర్కార్ సంకీర్ణ ప్రభుత్వమే. ఎస్పీ, బీఎస్పీ సహకారంతో కమల్‌నాథ్ ప్రభుత్వం నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సింధియా ఎర్రజెండా చూపిస్తే, ప్రభుత్వం పడిపోవడం ఖాయం. అందుకే, సింధియా- చౌహాన్‌ భేటీ ఆసక్తికరంగా మారింది. అయితే, అభివృద్ధి కార్యక్రమాల్లో చౌహాన్‌ మద్దతు కోరేందుకే సింధియా ఆయనను కలిశారని.. పుకార్లు నమ్మొద్దని కాంగ్రెస్ చెబుతోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top