పవన్‌ జేఎఫ్‌సీ కొత్తగా ఏం కనిపెట్టింది?

political analysis critics pawan kalyan jfc - Sakshi

ప్రత్యేకహోదాను పక్కనబెట్టి, నిధులపై చర్చలేమిటి?

అనధికార సమాచారమే చర్చకు ప్రాతిపదికా?

రెండు రోజుల చర్చలతో తేల్చిందేమిటి?

పెదవి విరుస్తున్న రాజకీయ విశ్లేషకులు

రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు ఐఏఎస్‌లను నియమించిందంటూ లీకులు

వారి నియామకాలపై కనిపించని ప్రభుత్వ ప్రకటన

మనం చర్చించిన సమాచారం ఎక్కడిదన్న ఉండవల్లి

సాక్షి, అమరావతి : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ జాయింట్‌ ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీ (జేఎఫ్‌సీ) తొలి సమావేశం శనివారం హైదరాబాద్‌లో ముగిసింది. ఈ రెండు రోజుల సమావేశం కొత్తగా ఏమి కనిపెట్టిందో అర్థం కావడం లేదని రాజకీయ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. ఈనెల 15 లోపు పూర్తి సమాచారం ఇవ్వాలని పవన్‌ కళ్యాణ్‌ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసినా అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం గానీ కనీసం స్పందించకపోగా... కొందరు వ్యక్తుల కోసం తాము సమాచారాన్ని బజార్లో పెట్టబోమని, అసెంబ్లీలో చెబుతామని సాక్షాత్తు ముఖ్యమంత్రే చెప్పారు. దీంతో వైబ్‌సైట్లలో, సామాజిక మాధ్యమాల్లో దొరికిన సమాచారం ఆధారంగానే నిజనిర్ధారణ జరిగింది. ఏదో ఒక నెపం మీద తిరస్కరిస్తున్న తీరును ప్రశ్నించారే తప్ప దానికి సరైన సాక్ష్యాధారాలను కనిపెట్టలేకపోయారు. ప్రత్యేక హోదానా, ప్రత్యేక ప్యాకేజీనా? అనే దానిపైనా స్పష్టత ఇవ్వలేకపోయారు.

దేనివల్ల రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతుందనే దానిపై స్వల్ప చర్చతో సరిపెట్టారు. హోదాతోనే విద్య, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని జనం నెత్తినోరు కొట్టుకుని చెబుతుండగా... దేనివల్ల ఎన్ని నిధులు వస్తాయని చర్చించడం సమంజసంగా లేదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 2016 సెప్టెంబర్‌లో, 2017 మార్చిలో సాక్షాత్తు ముఖ్యమంత్రే రెండుసార్లు ప్యాకేజీకి అంగీకరించినందున దాన్నుంచి వెనక్కుపోవడం సాధ్యం కాదని తేల్చిచెబుతున్నారు. రాజధాని నిర్మాణానికి కేటాయించిన నిధులెన్నీ, వచ్చినవి ఎన్ని? అనే దానిపైనా సమావేశంలో స్పష్టత కొరవడింది. టీవీ చర్చల్లో, విలేకరుల సమావేశాల్లో చెప్పిన వివరాలే ఈ భేటీకి ప్రాతిపదిక అయితే అర్థం ఏముందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. నేతలందరూ ఏకమై ప్రత్యేకహోదా కోసంపోరాడాల్సిన తరుణంలో నిధుల లెక్కలంటూ సమావేశం నిర్వహించడం సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నంలా ఉందన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ, టీడీపీల తరఫున ప్రచారం చేసిన పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నేరుగా ప్రశ్నించకుండా జేఎఫ్‌సీ పేరిట సమావేశాలు నిర్వహించడం పలు అనుమానాలకు తావిస్తోందని విమర్శిస్తున్నారు.

కమిటీకి కొరవడిన స్పష్టత
కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య నాయకత్వంలో కమిటీ మొత్తం 11 అంశాలపై చర్చించినా దేనిపైనా నిర్దిష్టమైన నిర్ణయానికి రాలేకపోయింది. కొన్ని అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత లేదని, మరికొన్నింటిలో కేంద్రానిది తప్పు ఉందని జేఎఫ్‌సీ కనిపెట్టింది. రూ.16,078 కోట్ల రెవెన్యూ లోటుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటే కేంద్రం రూ.4,113 కోట్లు ఇచ్చి మిగతా వాటినన్నింటినీ తిరస్కరించిందని పద్మనాభయ్య తెలిపారు. పెన్షన్‌ పెంపు, రుణ విమోచన, డిస్కంల నష్టాల సర్దుబాటు, పదో వేతన సంఘం బకాయిలు వంటి వాటికి తాము డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్రం చెప్పినట్టు వివరించారు. చాలా పథకాలు, కార్యక్రమాలు ఆచరణ సాధ్యం కానివిగా కేంద్రం కొట్టిపారేసిందని, రాష్ట్ర విభజనే వయబులిటీ లేనిదైతే... మెట్రో, పెట్రోకెమికల్‌ ప్రాజెక్టు, కడప స్టీల్‌ ప్లాంట్, రైల్వే జోన్‌ వంటి వాటికి ఎలా వయబులిటీ ఉంటుందని కొందరు ప్రశ్నించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికే స్పష్టత లేదని సమావేశం అభిప్రాయపడింది.

జాతీయ విద్యా సంస్థల వ్యవహారంలోనూ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిన తీరులో స్పందించలేదని, వీటి బడ్జెట్‌ గురించి ఎక్కడా ప్రస్తావనే లేదని సమావేశంలో పాల్గొన్న పలువురు పేర్కొన్నారు. ఈ సంస్థలకు రూ.11 వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా... ఇప్పటికి కేవలం రూ.500 కోట్లే ఇచ్చినట్టు తమ వద్ద ఉన్న పేపర్లలో ఉన్నట్టు పద్మనాభయ్య తెలిపారు. దుగరాజుపట్నం పోర్టుకు కేంద్ర కేబినెట్‌ కమిటీ ఆమోదం తెలిపినా నీతి ఆయోగ్‌ మోకాలడ్డిందని, కడప స్టీల్‌ ప్లాంట్‌ విషయంలోనూ అదే జరిగిందని, అయినా రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించడం లేదని తోట చంద్రశేఖర్‌ తదితరులు చెప్పారు. తొలిరోజు భేటీకి హాజరైన సీపీఎం, సీపీఐ, లోక్‌సత్తా నాయకులు, త్రిసభ్య కమిటీ సభ్యుడయిన ఐవైఆర్‌ కృష్ణారావు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గోపాలగౌడ రెండో రోజు సమావేశానికి హాజరుకాలేదు.

సమాచారం రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చిందా?: ఉండవల్లి
జేఎఫ్‌సీ చర్చించిన సమాచారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిందేనా? అని ఉండవల్లి జనసేన నేతను అడిగారు. జయప్రకాష్‌ నారాయణ తన సోర్స్‌ ద్వారా కొంత సంపాదించారని, మరికొంత వేరే మార్గం ద్వారా వచ్చిందని పవన్‌ బదులిచ్చారు. ‘అయితే మనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవీ స్పందించలేదన్న మాట’ అని ఉండవల్లి వ్యాఖ్యానించారు. ’పవన్‌ ఇంకా ఎన్‌డీఏ భాగస్వామే. దాన్నుంచి బయటకు వచ్చినట్టు చెప్పలేదు. సమాచారం కావాలని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. అయినా ప్రభుత్వాలు స్పందించలేదు’ అని తెలిపారు.  

ఇద్దరు అధికారుల్ని నియమించారంటూ లీకులు
ఈ దశలో పవన్‌ వద్దకు వచ్చిన జనసేన కార్యకర్త ఒకరు జేఎఫ్‌సీ కమిటీతో మాట్లాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు ఐఎఎస్‌లు ప్రేంచంద్రారెడ్డి, ఎస్‌.బాలసుబ్రమణ్యంలను నియమించదని చెప్పారు. ఇదో శుభ పరిణామమని, ఆ ఇద్దరూ తనతో కాకుండా పద్మనాభయ్య, జయప్రకాశ్‌ నారాయణ, టి.చంద్రశేఖర్, ఐవైఆర్‌ కృష్ణారావుతో మాట్లాడమని చెబుతానని పవన్‌ చెప్పారు. అయితే ఆ ఇద్దరు అధికారులను నియమించినట్టు రాత్రి వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలేదు. అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని పార్టీలనే పిలిచామని శుక్రవారం జనసేన వర్గాలు ప్రకటించగా.. వైఎస్సార్‌ సీపీ, టీడీపీలకు కూడా సమాచారం పంపామని పవన్‌ శనివారం చెప్పారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top