మమతతో పోలీసుల కుమ్మక్కు | Sakshi
Sakshi News home page

మమతతో పోలీసుల కుమ్మక్కు

Published Fri, May 17 2019 3:45 AM

Police trying to wipe out evidence of statue desecration - Sakshi

మథురాపూర్‌ / చందౌలీ / మిర్జాపూర్‌: ప్రధాని నరేంద్ర మోదీ గురువారం పశ్చిమబెంగాల్‌ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో కుమ్మక్కైన పోలీసులు సంఘసంస్కర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ విగ్రహం ధ్వంసానికి సంబంధించిన సాక్ష్యాలను మాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తప్పదని అర్థం కావడంతో మమతా బెనర్జీ తనను జైల్లో పెట్టిస్తామని బెదిరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలను వేధిస్తున్న తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) గూండాలే ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేశారని మోదీ పునరుద్ఘాటించారు. పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో గురువారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ, విపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఆందోళనలో మమత..
టీఎంసీ నేతలు, ఆ పార్టీకి చెందిన గూండాలు బెంగాల్‌ను నరకంగా మార్చేశారని ప్రధాని మోదీ విమర్శించారు. ‘నారదా, శారదా చిట్‌ఫంట్‌ కుంభకోణాల్లో సాక్ష్యాలను మాయంచేసిన రీతిలోనే ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ విగ్రహ ధ్వంసం ఘటనలో సాక్ష్యాలను అదృశ్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ దుశ్చర్యకు కారకులైనవారిని కఠినంగా శిక్షించాలి. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి ఖరారవడంతో మమతా బెనర్జీ కలవరపడుతున్నారు. ఆ ఆందోళనతోనే నన్ను జైల్లో పెట్టిస్తామని బెదిరిస్తున్నారు. మమతా బెనర్జీ ఆమె మేనల్లుడు అభిషేక్‌లు బెంగాల్‌ను లూటీచేయడం, బలవంతపు వసూళ్ల సిండికేట్‌ను నడపడమే పనిగా పెట్టుకున్నారు. ఈ అత్తా–అల్లుడి ప్రభుత్వాన్ని సాగనంపాలని ప్రజలు నిర్ణయించుకున్నారు’ అని మోదీ ఆరోపించారు.

‘జై శ్రీరామ్‌’ అనడమూ నేరమే..
పశ్చిమబెంగాల్‌లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీజేపీ పోరాడుతోందని ప్రధాని మోదీ తెలిపారు. ‘పశ్చిమబెంగాల్‌లో ప్రజాస్వామ్యం అపఖ్యాతిపాలైంది. దుర్గాపూజ, సరస్వతీపూజతో పాటు చివరికి జై శ్రీరామ్‌ అని నినదించడం కూడా బెంగాల్‌లో నేరమైపోయింది. రాష్ట్రంలోని బీజేపీ కార్యాలయాలను కూడా స్వాధీనం చేసుకుంటామని మమతా బెనర్జీ బెదిరించారు. పశ్చిమబెంగాల్‌లో ప్రజాస్వామ్య పరిరక్షణకు బీజేపీ పోరాడుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలపై తన బొమ్మ వేసుకుంటూ మమతా బెనర్జీ స్టిక్కర్‌ దీదీగా మారిపోయారు. ఆమెకు భారత ప్రధానిపై నమ్మకం ఉండదు కానీ, పాక్‌ ప్రధానిని మాత్రం ఏ జంకూ లేకుండా ప్రశంసిస్తారు. ఓవైపు బీజేపీ కార్యకర్తలను జైలులో పెడుతున్న బెంగాల్‌ పోలీసులు, మరోవైపు టీఎంసీ గూండాలను మాత్రం స్వేచ్ఛగా తిరగనిస్తున్నారు’ అని ఆరోపించారు.

విపక్షాలు విఫలమయ్యాయి..
తనపై ప్రతిపక్షాల దూషణలు పెరిగేకొద్దీ ప్రజల ప్రేమ కూడా పెరుగుతూనే ఉందని ప్రధాని మోదీ తెలిపారు. ‘ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోతున్నామని మహాకల్తీ కూటమిలోని రాజకీయ పార్టీలన్నింటికి అర్థమైంది. ఇవన్నీ మోదీ హటావో(మోదీని తప్పించండి) అనే నినాదంతో ముందుకెళుతున్నాయి. బెంగళూరులో ఓ వేదికపై గ్రూప్‌ ఫొటో దిగిన ఈ పార్టీల నేతలంతా కలసికట్టుగా ప్రధాని పదవికి ఓ అభ్యర్థిని ఎన్నుకోవడంలో మాత్రం ఘోరంగా విఫలమయ్యారు. ప్రధాని ఎవరు అవుతారన్న ప్రశ్న ఉదయించగానే, ఎవరి డబ్బావారు వాయించుకోవడం మొదలుపెట్టారు’ అని మోదీ ఎద్దేవా చేశారు.

‘10 సీట్లు, 20, 22, 30, 55 లోక్‌సభ సీట్లు ఉన్నవారంతా ప్రధాని అయిపోవాలని కలలు కంటున్నారు. కలలు కనడం తప్పుకాదు. కా నీ ఇప్పుడు దేశమంతా ఫిర్‌ ఏక్‌ బార్‌ మోదీ సర్కార్‌(ఈసారి కూడా మోదీ ప్రభుత్వమే) అంటోంది. మేం జాతీయ భద్రత విషయంలో రాజీపడం. ఉగ్రవాదులను ఏరివేయడంతో పాటు వేర్పాటువాదుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం. ఈ సేవకుడు ప్రజల ఆశలు, ఆకాంక్షల సాధన దిశగా దేశాన్ని ముందుకు తీసుకెళుతున్నాడు’ అని తెలిపారు.

Advertisement
Advertisement