మోదీ నోట.. ఆ మాట రానేలేదు

PM Modi Never Said Deposit Money in Citizens Accounts - Sakshi

రూ.15 లక్షల డిపాజిట్‌ హామీ తూచ్‌ అన్న బీజేపీ నేత

పుణే: నాలుగేళ్ల పాలనలో బీజేపీ ప్రభుత్వం అన్నింటా విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆ విమర్శలను తిప్పికొట్టేందుకు బీజేపీ నానా ప్రయాసలు పడుతోంది. ఈ క్రమంలో బీజేపీ నేత అమర్‌ సాబ్లే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల సందర్భంగా ప్రతీ పౌరుడి బ్యాంకు ఖాతాలో రూ. 15 లక్షలు డిపాజిట్‌ చేస్తానని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని, అది నెరవేర్చలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీనిపై స్పందించిన అమర్‌.. అసలు మోదీ నోట ఆ మాట రాలేదని చెబుతున్నారు. 

‘ప్రజల ఖాతాలో డబ్బు డిపాజిట్‌ చేస్తానని మోదీగారూ ఏనాడూ చెప్పలేదు. అదసలు బీజేపీ ఎన్నికల మేనిఫేస్టోలో లేని అంశం. అలాంటప్పుడు ఆ ప్రస్తావన ఎక్కడి నుంచి వస్తుంది. పైగా ప్రతిపక్షాలు ఈ విషయంపై రాద్ధాంతం చేస్తున్నాయి. రూ. 15 లక్షలను ఖాతాలో వేస్తామన్న హామీ, బీజేపీ విఫలం.. అంటూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయి. ఇలాంటి విషయాల్లో జనాల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లటం మంచిది కాదు’ అని అమర్‌ సాబ్లే పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం పింప్రీలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన పై వ్యాఖ్యలు చేశారు. 

విదేశాల్లో మూలుగుతున్న నల్లధనానంత వెనక్కి తెప్పించి.. ప్రతీ పౌరుడి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేయిస్తానని మోదీ నాటి ఎన్నికల(2014) ప్రచారంలో ప్రామిస్‌ చేశారు.  ఈ హామీపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ... అది సాధ్యమయ్యే పని కాదని అందరికీ తెలుసని.. అదోక రాజకీయ జుమ్లా అని చెప్పారు. ఇక ఈ హామీపై ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద 2016 నవంబర్‌లో వివరణ కోరాడు. అయితే రెండేళ్ల తర్వాత ప్రధాని కార్యాలయం అదసలు ‘సమాచారం’ కిందే రాదంటూ అతని దరఖాస్తును తిరస్కరించటం గమనార్హం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top