నేనూ కాపలాదారునే..

PM Modi launches Main Bhi Chowkidar campaign - Sakshi

ప్రతినబూనాలని మద్దతుదారులకు మోదీ పిలుపు

న్యూఢిల్లీ: సామాజిక రుగ్మతలు, అవినీతికి వ్యతిరేకంగా జరిగే పోరులో తనతో కలిసి రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మద్దతుదారులను కోరారు. ‘నేను కూడా కాపలాదారునే’(మై భీ చౌకీదార్‌) అంటూ ప్రతిజ్ఞ చేయాలని వారికి పిలుపునిచ్చారు. ‘మీ కాపలాదారు (చౌకీదార్‌)గా దేశానికి సేవ చేసేందుకు గట్టిగా నిలబడ్డాను. కానీ, నేను ఒంటరిని కాను. అవినీతి, చెడు, సామాజిక రుగ్మతలపై పోరు సాగించే ప్రతి ఒక్కరూ కాపలాదారే. దేశ పురోగతికి కృషి చేసే ప్రతి ఒక్కరూ కాపలాదారే. నేడు ప్రతి భారతీయుడూ ‘నేనూ కాపలాదారునే’ అంటున్నారు’ అని ట్విట్టర్‌లో పేర్కొంటూ ఒక వీడియోను ట్యాగ్‌ చేశారు.

ప్రధాని పిలుపును కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఎద్దేవా చేశారు. ‘మోదీ! మీరు ఆత్మరక్షణలో ఈ ట్వీట్‌ చేశారు. ఈ రోజు కాస్తంత అపరాధంతో ఉన్నారు’ అని పేర్కొంటూ విజయ్‌ మాల్యా, అనిల్‌ అంబానీ, నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీలతో ప్రధాని ఉన్న ఫొటోలను ట్యాగ్‌ చేశారు. ప్రధాని మోదీ పిలుపుపై కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా స్పందించారు. ‘దొంగ కాపలాదారు మోదీ ఒక్కరే’ అంటూ ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే చౌకీదార్‌ అని ప్రధాని మోదీ తరచుగా తనను తాను పోల్చుకుంటుండటం తెలిసిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top