బీజేపీ, టీడీపీలది కర్కశ పాలన

PD Rangaiah Slams Chandrababu Naidu in Anantapur - Sakshi

రాష్ట్ర ప్రజలను నమ్మించి గొంతు కోశారు

సంకల్పంతోనే వైఎస్‌ జగన్‌ పాదయాత్ర

ప్రజాశీస్సులతో పూర్తి చేస్తారు మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి

అనంతపురం: ‘‘కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ కర్కశ పాలన కొనసాగిస్తున్నాయి. స్వాతంత్య్రం రాకముందు బిట్రీష్‌ పాలనలో కూడా ఇలా వ్యవహరించలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవస్థలన్నీ గుప్పిట్లో పెట్టుకుని పాలిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలకు అండగా నిలిచేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2017 నవంబర్‌ 6న ఇడుపులపాయలో పాదయాత్ర ప్రారంభించారు. ఇప్పటికి ఏడాది పూర్తయింది. దీని వెనుక సంకల్పం, లక్ష్యం, ధ్యేయం ఉంది.’’ అని మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ అనంతపురం పార్లమెంట్‌ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాదయాత్ర ప్రారంభంలో టీడీపీ, బీజేపీ హేళన చేశాయన్నారు.

జనాలను తరలిస్తున్నారంటూ మాట్లాడారన్నారు. ప్రజాశీస్సులతో తమ అధినేత ఇప్పటిదాకా 294 రోజులు 3211.5  కిలోమీటర్లు పాదయాత్ర చేశారన్నారు. 1739 గ్రామాలు, 8 కార్పొరేషన్లు, 45 మునిసిపాలిటీలు, 255 మండలాల్లో తిరిగారన్నారు. ఇది అపూర్వమైన ఘట్టం అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవినీతి, ఏకపక్ష పరిపాలన వల్ల విసిగిపోయిన అన్ని వర్గాల ప్రజలు జగన్‌ పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. వారు పడుతున్న ఇబ్బందులను వైఎస్‌ జగన్‌కు వివరించారన్నారు. వచ్చే ఎన్నికల్లో మట్టి కరిపిస్తారనే భయంతోనే పాదయాత్రను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు చేసిందన్నారు. అయినా వైఎస్‌ జగన్‌ జడుసుకోలేదన్నారు. ప్రజాశీస్సులతో ఆయన ముందడుగు వేస్తున్నారన్నారు. దేశంలో ఎవరూ చేయని విధంగా సుదీర్ఘ యాత్ర చేయాల్సిన పరిస్థితులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాయన్నారు. నాలుగైదు రోజుల్లో ప్రారంభమయ్యే పాదయాత్ర దిగ్విజయంగా పూర్తవుతుందన్నారు.

ఎదురించలేక హత్యాయత్నం
పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి భయపడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు ఎన్నికలకు పోవాలని చూశాయన్నారు. కానీ జరగలేదన్నారు. వైఎస్‌ జగన్‌ ఉన్నంతవరకు ఎదురించలేమని తేలిపోవడంతో కడకు తుద ముట్టించాలని ఎత్తుగడ వేసి హత్యాప్రయత్నం చేయించారని ఆరోపించారు. కేంద్రం పరిధిలో ఉన్న ఎయిర్‌పోర్ట్‌ ఆవరణలో హత్యాయత్నం జరిగితే తమకేం సంబంధం అంటున్న చంద్రబాబు సీబీఐ విచారణకు ఎందుకు కోరలేదని మండిపడ్డారు. కోడికత్తి అని హేళనగా మాట్లాడుతున్న చంద్రబాబు ఆపరేషన్‌ గరుడ అని 8 నెలల కిందట మాట్లాడిన నటుడు శివాజీని ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. చంద్రబాబు రాజకీయమే రక్తసిక్తం అన్నారు. కుట్రలు, కుతంత్రాలతో సీఎం అయ్యారని మండిపడ్డారు.

బీజేపీతో కలిసి మోసం చేసి ఈ రోజు కొత్తపల్లవి
ప్రత్యేకహోదా, విభజన చట్టంలోని హామీలు అమలులో బీజేపీతో కలిసి చంద్రబాబు మోసం చేశారన్నారు. ప్రత్యేకహోదా అంటే సంజీవనా? అని ఆ రోజు హేళనగా మాట్లాడిన చంద్రబాబు ఈ రోజు ప్రత్యేకహోదా, రైల్వేజోన్, హైకోర్టు కావాలంటూ కొత్తపల్లవి అందుకున్నారన్నారు. వెనుకబడిన 7 జిల్లాలకు బుందేల్‌ఖండ్‌ తరహా ప్రాజెక్ట్‌ అంటే దాదాపు రూ.7 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. కేంద్రం ముష్టి రూ.50 కోట్లు ఇస్తే మహాప్రసాదంలా తీసుకున్న చంద్రబాబు ఆరోజే ఎందుకు నిలదీయలేదన్నారు. నాలుగేళ్ల తర్వాత బీజేపీ మోసగించిందంటూ బయటకు వచ్చినట్లు నాటకాలు ఆడుతున్నారన్నారు.

మహాసంకల్పం కోసమే పాదయాత్ర: తలారి పీడీ రంగయ్య
వ్యవస్థల మార్పునకు, మహా సంకల్పం కోసమే వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేపడుతున్నారని అనంతపురం పార్లమెంటు సమన్వయకర్త తలారి పీడీ రంగయ్య అన్నారు. ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా ఈస్థాయిలో పాదయాత్ర చేసి ఉండరని గుర్తు చేశారు. వ్యవస్థలన్నింటినీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాశనం చేశాయన్నారు. ప్రజాస్వామ్యం పరిరక్షణకే కాంగ్రెస్‌తో కలిశానని చెబుతున్న చంద్రబాబు ఆయన హయాంలో ఏ ఒక్క వ్యవస్థ బాగుపడలేదన్నారు. జన్మభూమి కమిటీలు తీసుకొచ్చి పంచాయతీరాజ్‌ వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు. చట్టసభల్లో ఎమ్మెల్సీని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయి హైదరాబాద్‌ నుంచి అమరావతికి వచ్చేశారన్నారు. దేశంలో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన వ్యక్తి సీఎం చంద్రబాబే అన్నారు.

పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఏకంగా మంత్రి పదవులు ఇచ్చిన ప్రభుత్వం చంద్రబాబుదేనన్నారు. కేవలం అధికారం కోసమో చంద్రబాబు కాంగ్రెస్‌తో జత కట్టారన్నారు. తాను ఏం చేసినా ప్రజలు నమ్ముతారనే భావన చంద్రబాబులో ఉందన్నారు. అది చాలా చెడ్డగుణం అన్నారు. వైఎస్‌ జగన్‌ను అంతమొందించేందుకే హత్యాప్రయత్నం జరిగిందన్నారు. పాదయాత్రలో ఏ నాయకుడికీ ఇంతభారీ స్థాయిలో ప్రజాదరణ లేదన్నారు. దీన్ని జీర్ణించుకోలేకే అధికార పార్టీ ఈ ఘాతుకానికి పాల్పడిందని ఆరోపించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గౌస్‌బేగ్, సంయుక్త కార్యదర్శి ఆలుమూరు శ్రీనివాసరెడ్డి, నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి, నాయకులు యూపీ నాగిరెడ్డి, గోగుల పుల్లయ్య, అనిల్‌కుమార్‌గౌడ్, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top