
సాక్షి, విశాఖ: జనసేన పార్టీకి విశాఖలో బిగ్ షాక్ తగలనుంది. మరో నేత ఆ పార్టీని వీడనున్నారు. ఇసుక కొరతను నిరసిస్తూ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదివారం (నవంబర్ 3) నగరంలో లాంగ్ మార్చ్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే అంతకు ముందే ఆ పార్టీ నేత పసుపులేటి బాలరాజు జనసేనకు గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన పాడేరు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. గత కొద్దిరోజులుగా బాలరాజు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
చదవండి: గాజువాకలో జనసేనకు భారీ ఝలక్
ఎన‍్నికల అనంతరం పవన్ తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంతేకాకుండా లాంగ్ మార్చ్ సన్నహాల కోసం నిన్న జరిగిన సమావేశానికి కూడా గైర్హాజరు అయ్యారు. ఇవాళ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు ఆయన తన రాజీనామా లేఖను పంపించనున్నారు. కొద్దిరోజులు రాజకీయాలకు దూరంగా ఉండి ఆ తర్వాత ఏ పార్టీలో చేరాలో బాలరాజు నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే పలువురు జనసేన పార్టీ నేతలు పార్టీని వీడిన విషయం తెలిసిందే.
పవన్‌కు వామపక్షాల ఝలక్
మరోవైపు పవన్ కల్యాణ్‌కు వామపక్షాలు కూడా ఝలక్ ఇచ్చాయి. ఆదివారం విశాఖలో పవన్ నిర్వహించనున్న నిరసనకు తాము హాజరు కావడం లేదని సీపీఎం, సీపీఐ నేతలు స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం ఓ లేఖను విడుదల చేశారు.