కౌన్సిలర్‌ టికెట్ల కోసం ఆశావహుల ఆరాటం | Party Leaders Requesting To Give Tickets For Local Elections In Mahabubnagar | Sakshi
Sakshi News home page

కౌన్సిలర్‌ టికెట్ల కోసం ఆశావహుల ఆరాటం

Jul 15 2019 7:04 AM | Updated on Jul 15 2019 8:13 AM

Party Leaders Requesting To Give Tickets For Local Elections In Mahabubnagar - Sakshi

సాక్షి, పాలమూరు: మున్సిపాలిటీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడకముందే గ్రామాల్లో రాజకీయం వేడెక్కింది. అన్ని పార్టీలు కీలక సంగ్రామంగా భావిస్తున్న పుర పోరుపైనే ప్రధాన పార్టీలు దృష్టి సారిస్తున్నాయి. ఒకవైపు  అధికార యంత్రాంగం ఎన్నికలకు చకచకా ఏర్పాట్లు చేస్తుండగా మరోవైపు పీఠం కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ముఖ్య నాయకులు పావులు కదుపుతున్నారు. ఏళ్లుగా ఎదురు చూస్తున్న నాయకులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగించుకోవడానికి ఉత్సాహం కనబరుస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో టిక్కెట్టు చేజారకుండా ముఖ్యనాయకులపై ఒత్తిడి పెంచుతున్నారు.  

బరిలో ఉంటామనేలా.. 
మున్సిపాలిటీ ఎన్నికల వార్డుల రిజర్వేషన్లు ఇంకా ప్రకటించలేదు. అయినా కొందరు ఔత్సాహికులు పార్టీ నుంచి తనకే టికెట్‌ ఖాయమనే తీరును ప్రదర్శిస్తున్నారు. ఈనెల 14లోగా రిజర్వేషన్లు తేలిపోనుండటంతో ఆశావహుల జోరు అన్ని పార్టీల్లో కనిపిస్తోంది. అధికార టీఆర్‌ఎస్‌కు ఈ పోటీ తీవ్రంగా ఉంది. ఒక్కో వార్డు నుంచి ముగ్గురు నుంచి ఐదుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. టిక్కెట్‌ను దక్కించుకోవడానికి ఇప్పటికే లాబింగ్‌లు మొదలెట్టారు. మొన్నటి వరకు వరకు పాలకవర్గంలో బాధ్యతలు  నిర్వర్తించిన నాయకులతోపాటు కొత్తగా టికెట్‌ను ఆశిస్తున్న వారి తాకిడి ఈ పార్టీలో అధికంగానే కనిపిస్తోంది. మరోవైపు టీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ, కాంగ్రెస్, పార్టీలు కూడా మహబూబ్‌నగర్‌ పుర పీఠాన్ని కైవసం చేసుకునేలా ముందుకు అడుగులేస్తున్నారు.

మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీల తరఫున రంగంలో నిలిచేందుకు నాయకగణం ఉవ్విళ్లూరుతున్నారు. గతంలో గెలిచి పాలనతీరులో భాగమైన సిట్టింగుల్లో ఎక్కువ మంది మరోసారి తమకు రిజర్వేషన్‌ అనుకూలిస్తుందని.. ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయాలనే భావనను కనబరుస్తున్నారు. ఆశించిన వార్డుతోపాటు అనుకూలంగా ఉండే ఇతర స్థానాల్లోనూ పోటీకి సై అనేలా చతురతను చూపిస్తున్నారు. కొత్తగా పోటీపట్ల ఆసక్తిని చూపించే వారి సంఖ్య కూడా పట్టణంలో క్రమంగా పెరుగుతోంది.

ప్రజలతో ఉన్న సత్సంబంధాలు తమకు కలిసి వస్తాయనే తీరుతో పోటీ దిశగానే దృష్టిని చూపిస్తున్నారు. అనుచరుల వద్ద టికెట్‌ పొందుతామనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. పనిలో పనిగా కాలనీల్లో, బస్తీల్లోని పెద్దలు సహా కుల సంఘాల వారికి పోటీ ఖాయమనే తీరుని మాటల్లో చెప్పకనే చెబుతున్నారు. అయితే తాను లేదంటే తన భార్య పోటీలో ఉంటుందనే విషయాన్ని కూడా ముందుస్తుగానే తెలియపరుస్తున్నారు. 

వలసలపై దృష్టి 
పట్టణ ప్రాంతంలో కీలకమైన కౌన్సిలర్‌ పోటీ చేయడాన్ని ఆయా పార్టీల నాయకులు సవాలుగా తీసుకుంటున్నారు. మరో వారం రోజుల్లో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ వస్తుందనే ఆశాభావంతో ముందస్తుగానే జోరును పెంచుతున్నారు. ప్రధానంగా ఇప్పుడున్న సొంత పార్టీలోనే టికెట్‌ కోసం శతవిధాల ప్రయత్నాలు  చేస్తున్నారు. ఒకవేళ ప్రతికూల పరిస్థితులు ఎదురైనా పక్క పార్టీలోకి మారైనా పోటీకి సమాయత్తమవుతున్నారు. ఉన్నఫలంగా నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత ఎక్కువగా సమయం ఉండకపోవడం అప్పటికప్పుడు అభ్యర్థుల వెతుకులాట సహా ఇతరత్రాలుగా ఎదురయ్యే ఇక్కట్లను తట్టుకునేందుకు ముందస్తుగానే అభ్యర్థుల విషయంలో ఓ అంచనాలున్నాయి.

తమ పార్టీలోని బలమైన నాయకుడికి టికెట్‌ ఇవ్వడం లేదా అనివార్యమైన చోట పక్క పార్టీలోని మంచి నాయకుడికి గాలం వేసి పార్టీలోకి ఆహ్వానించడం లాంటి ప్రయత్నాల్ని అన్ని పార్టీలు చేపట్టబోతున్నాయి. మరోవైపు నాయకులు కూడా తమ కళ్లముందున్న రాజకీయ వాతావరణానికి అనుగుణంగా వలసలకు తెరతీయనున్నారు. తమ సొంత పార్టీలో టికెట్‌ వచ్చేలా ప్రయత్నాలు చేసుకుంటున్నారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. 

పలు వార్డులపై దృష్టి 
మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీలో ఉన్న కొన్ని వార్డులపై అధికార పార్టీ నేతలు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. చాలా ఏళ్ల నుంచి కౌన్సిలర్లుగా ఉంటూ ప్రభుత్వంపై ప్రశ్నలు గుప్పిస్తున్న కొందరిని వచ్చే కౌన్సిల్‌కు రాకుండా చూడాలని ప్రణాళిక రచిస్తున్నారు. దీనిలో భాగంగా ఆయా వార్డుల్లో ఆకర్ష్‌ మంత్ర ప్రయోగాన్ని ఉపయోగిస్తున్నారు. అసెంబ్లీలో ఎన్నికల్లో, పార్లమెంట్‌ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా చతికిలపడింది.

గత ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు అందుకోవడంలో విఫలం అయిన ఈ పార్టీ మున్సిపల్‌ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళుతుందో చూడాల్సి ఉంది. అధిష్ఠానం సూచనల మేరకు మున్సిపాలిటీ ఎన్నికల సన్నద్ధతపై కాంగ్రెస్‌ తన కార్యాచరణను ప్రకటించనుంది. ఈ ఎన్నికలను చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పార్టీ తరుఫున టికెట్‌ తీసుకుని గెలిచాక నాయకులు అధికార పార్టీలోకి వెళ్లకుండా ఆచూతూచి వ్యవహరిస్తూ నమ్మకస్తులను ఎంపిక చేయడానికి ప్రయత్నిస్తున్నారు.  

జోరుమీదున్న కారు.. 
అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ భారీ అంచనాలతో ఉంది. వంద శాతం జెడ్పీ పీఠాలను సాధించినట్లే జిల్లాలో ఉన్న మున్సిపాలిటీల్లో సత్తా చాటి.. పదవులను కైవసం చేసుకోవాలని చూస్తోంది. రిజర్వేషన్లు ఎలా ఉన్నా గెలుపు గుర్రాలను పోటీలో నిలుపుతామని ఇప్పటికే మంత్రి ప్రకటించారు. ప్రస్తుత తరుణంలో మహబూబ్‌నగర్‌ పట్టణంలో మంత్రి శ్రీనివాస్‌గౌడు వార్డుల్లో అధికారులను వెంటబెట్టుకుని కలియదిరుగుతున్నారు. సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించాలంటూ అధికారులను ఆదేశిస్తున్నారు. ఇదే టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అన్ని కాలనీల్లో చేపడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వార్డుల్లో కౌన్సిలర్లుగా పోటీ చేయడానికి ఆశ పడుతున్నా ద్వితీయ శ్రేణి నాయకులు కష్టపడి పని చేస్తున్నారు.  

కమల వ్యూహం 
గతంలో పట్టణంలో బీజేపీ ఆరుసీట్లు దక్కించుకుంది. ఒకప్పుడు ఆ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలను పెద్దగా పట్టించుకునేది కాదు. కానీ పార్లమెంట్‌ ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెలిచాక జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తెలంగాణ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టిసారించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో  పాగా వేయాలని వ్యూహం రచించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పార్టీ కంటే 4500ఓట్ల మెజార్టీ వచ్చింది. దీంట్లో పట్టణంలో అధికంగా ఓట్లు వచ్చాయి. ఇదే స్ఫూర్తితో వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో సత్తాచాటాలని చూస్తున్నారు. గతసారి కాంగ్రెస్‌కు మద్దతు పలకడంతో మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీలో బీజేపీకి వైస్‌ చైర్మన్‌ పదవి దక్కింది. అయితే ఈసారి వార్డుల సంఖ్య పెంచుకొని చైర్మన్‌ పదవి దక్కించుకోని సంస్థాగతంగా బలోపేతం కావాలనే యోచనలో బీజేపీ నాయకులు ఉన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement