జెడ్పీలకు భవనాలెట్ల!

Panchayati Raj Department has been searching for ZPTC buildings - Sakshi

జూలై 5 నుంచి కొత్త జిల్లా పరిషత్‌లు

కార్యాలయాలు వెతుకుతున్న యంత్రాంగం  

సాక్షి, హైదరాబాద్‌: పరిషత్‌ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో స్థానిక పరిపాలన కొత్త రూపు సంతరించుకోనుంది. జిల్లా పరిషత్‌ ఎన్నికలు పూర్తయ్యాయి. ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం జూలై 4తో ముగియనుంది. ఆ మరుసటి రోజు నుంచి కొత్తగా ఎన్నికైన వారి పదవీకాలం మొదలవుతుంది. కొత్తగా ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యులు మొదటి సమావేశంలోనే పదవీ బాధ్యతలు చేపడతారు. పాలకవర్గం సైతం అదే రోజు కొలువుదీరుతుంది. జిల్లాల పునర్విభజనతో ప్రస్తుతం ఉన్న తొమ్మిది జిల్లా పరిషత్‌లు 32కు పెరగనున్నాయి. అన్ని జిల్లాల్లో జెడ్పీ భవనాల కోసం పంచాయతీరాజ్‌ శాఖ వెతుకులాట మొదలుపెట్టింది.ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని జెడ్పీ భవనాలు అన్ని రకాలుగా గొప్పగానే ఉన్నాయి.

కొత్త జిల్లా కేంద్రాల్లో ఆ స్థాయి భవనాలు ఎక్కడా లేవు. ఒకటిరెండు కొత్త జిల్లాల్లో తప్పితే జెడ్పీలకు ప్రభుత్వ భవనాలు ఉన్న పరిస్థితి లేదు. దీంతో పరిపాలన భవనం, సమావేశ మందిరం వంటి హంగులతో ఉండే భవనాల కోసం అధికారులు వెతుకుతున్నారు. ఎక్కువ జిల్లాల్లో ఆ కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయాన్ని జెడ్పీ కార్యాలయాలుగా మార్చాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీంతో మండల పరిషత్‌లకు కొత్తగా కార్యాలయాలు వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకు సొంత భవనాలలో ఉన్న మండల పరిషత్‌ కార్యాలయాలను ఇప్పుడు ఇతర భవనాల్లోకి మార్చాల్సిన పరిస్థితి నెలకొంది. జెడ్పీ కార్యాలయాల కోసం భవనాల ఎంపిక ప్రక్రియను రెండుమూడు రోజుల్లో పూర్తి చేయాలని జిల్లాల అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.  

రెండు జెడ్పీలు ఆలస్యం...
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపే విషయంలో జాప్యం వల్ల ఆ జిల్లా పరిషత్‌ పాలకవర్గం పదవీకాలం ఆలస్యంగా మొదలైంది. 2019 ఆగస్టు 6తో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్‌ పాలకవర్గం పదవీకాలం ముగియనుంది. ఆ మరుసటి రోజు నుంచి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్‌ పదవీకాలం మొదలుకానుంది.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top