గరళకంఠుడిలా బాధననుభవిస్తున్నా!

Pain running a coalition, says Kumaraswamy - Sakshi

సంకీర్ణ సమస్యలపై సీఎం కుమారస్వామి కన్నీళ్లు

సాక్షి బెంగళూరు: కర్ణాటకలో జేడీఎస్‌–కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వంలో లుకలుకలు బయటపడుతున్నాయి. సీఎం స్థానంలో తను సంతోషంగా లేనని.. గరళకంఠుడిలా బాధను దిగమింగుతూ పనిచేస్తున్నానని కుమారస్వామి కన్నీటిపర్యంతం అయ్యారు. బెంగళూరులో జేడీఎస్‌ కార్యకర్తలు ఏర్పాటుచేసిన సన్మానసభలో కుమారస్వామి ఉద్వేగాన్ని తట్టుకోలేకపోయారు. ‘మీ సోదరుడినైన నేను సీఎం కావడంతో మీరందరూ సంతోషంగా ఉన్నారు. కానీ నేనే బాధగా పనిచేస్తున్నా.

లోక కల్యాణార్థం గరళాన్ని మింగిన విషకంఠుడిలా నిత్యం బాధను దిగమింగుకుంటున్నా’ అని ఉద్వేగానికి గురైన కుమారస్వామి ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు.. తనకు అవకాశమిస్తే పేదలు, రైతుల సమస్యలు తీరుస్తానని, పేదల అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తానని కోరానన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తిరిగినపుడు ప్రజలు ఎంతో ప్రేమను చూపించారని.. అయితే తమ పార్టీ అభ్యర్థులకు ఓటేయడం మరిచిపోయారన్నారు. అయితే ప్రజలు తనను విశ్వసించలేదన్నారు. కన్నీటిని ఆపుకుంటున్న కుమారస్వామిని చూసి జేడీఎస్‌ కార్యకర్తలు ‘మేం మీతోనే ఉన్నా’మంటూ నినదించారు.  

సామాన్యులను మోసం చేస్తూ..
కుమారస్వామి ఉద్వేగ భరిత ప్రసంగాన్ని విపక్ష బీజేపీ ఓ నాటకంగా కొట్టిపడేసింది. సీఎం ఓ మంచి నటుడని.. సామాన్యులను పిచ్చోళ్లను చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని విమర్శించింది. అటు కాంగ్రెస్‌ కూడా కుమారస్వామి వ్యాఖ్యలను ఖండించింది. కాంగ్రెస్‌–జేడీఎస్‌ సర్కారు సజావుగానే సాగుతోందని, ఐదేళ్లపాటు అధికారంలో ఉంటుందని జేడీఎస్‌ ప్రతినిధి డానిష్‌ అలీ తెలిపారు. కుమారస్వామి కాస్తంత ఉద్వేగానికి గురయ్యారన్నారు. కాగా, ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్‌ గాంధీ నాయకత్వంపై తనకెలాంటి అభ్యంతరం లేదని జేడీఎస్‌ అధినేత దేవెగౌడ చెప్పారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top