15న సహకార ఎన్నికలు

PACs Election On 15/02/2020 In Telangana - Sakshi

షెడ్యూల్‌ ప్రకటించిన రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ

3వ తేదీన జిల్లాల వారీగా నోటిఫికేషన్‌ 

906 ప్రాథమిక సహకార సంఘాలకు ఎన్నికలు

ఆ తర్వాత డీసీసీబీ, టెస్కాబ్‌  చైర్మన్ల ఎన్నిక

కొత్త సహకార సంఘాల ఏర్పాటు లేనట్లే 

సాక్షి, హైదరాబాద్‌: ప్రాథమిక సహకార సంఘాల (ప్యాక్స్‌) ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ గురువారం ప్రకటించింది. ఈ మేరకు వచ్చే నెల 15న రాష్ట్రంలోని 906 ప్యాక్స్‌లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లాల వారీగా వచ్చే నెల 3న నోటిఫికేషన్లు జారీ చేస్తారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు ఎన్నికల అధికారులను నియమించాల్సి ఉంటుంది. అన్ని ప్యాక్స్‌లలో మొత్తంగా 18,42,412 మంది ఓటర్లు ఉన్నారు. హైదరాబాద్‌ మినహా మిగిలిన పూర్వ తొమ్మిది జిల్లాల్లో (కొత్తగా 32) మొత్తం 909 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి.

ప్రస్తుతం 906 ప్యాక్స్‌లకే ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉమ్మడి వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కొక్క సహకార సంఘానికి ఎన్నికలు జరగడం లేదు. వీటిలో వరంగల్, నల్లగొండ జిల్లాల్లో ఉన్న ఒక్కొక్క సహకార సంఘానికి ఆగస్టు చివరి వరకు పాలక వర్గానికి కాలపరిమితి ఉంది. రంగారెడ్డి జిల్లాలోని మామిడిపల్లి పనితీరు సక్రమంగా లేకపోవడంతో దాన్ని రద్దు చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

ముఖ్యమంత్రి ఆదేశాలతో: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో సహకారశాఖ తక్షణమే ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేసింది. వాస్తవంగా కొత్తగా ఏర్పడిన మండలాలతో పాటు, ప్రతీ మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని కచ్చితంగా రెండు ప్రాథమిక సహకార సంఘాలు (ప్యాక్స్‌) ఉండాలని ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ప్రక్రియలో సహకార శాఖ నిమగ్నమైంది. ఆ ప్రకారం కొత్త వాటిని ఏర్పాటు చేసి మొత్తం 1,343 ప్యాక్స్‌లకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని అనుకున్నారు.

ప్రస్తుతం మొత్తం 584 మండలాలకు 909 సహకార సంఘాలున్నాయి. 81 మండలాల్లో ఒక్క ప్యాక్స్‌ కూడా లేదు. మరికొన్ని మండలాల్లో 2 నుంచి 3 వరకు ఉన్నాయి. ప్రస్తుతమున్న 584లో 272 మండలాల్లో ఒక్కో ప్యాక్స్‌ మాత్రమే ఉంది. కొత్త నిబంధనల ప్రకారం వీటన్నింటిలో అదనంగా మరొక ప్యాక్స్‌ ఏర్పాటు చేయాలని అనుకున్నారు. 81 మండలాల్లోనూ రెండు చొప్పున మొత్తం 162 ఏర్పాటు చేయాలన్నది ఆలోచన. దీంతో కొత్తగా 434 ప్రాథమిక సహకార సంఘాలు ఏర్పాటు కావాల్సి ఉంది. ఈ ప్రక్రియ అంతా జరగాలంటే జూన్‌ వరకు సమయం పడుతుంది. కానీ ప్రభుత్వం తక్షణమే నియమించాలని కోరడంతో ప్రస్తుతమున్న ప్యాక్స్‌కు మాత్రమే ఎన్నికలు జరుగుతాయి.

డీసీసీబీలకు మాత్రమే.. 
ఉమ్మడి జిల్లాల ప్రకారం ఉన్న జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకే (డీసీసీబీ) ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్యాక్స్‌కు ఒక్కసారి కూడా ఎన్నికలు జరగలేదు. 2018లోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ వరుస ఎన్నికలతో వాయిదా పడుతూ వస్తోంది. ప్యాక్స్‌లకు ఎన్నికలు పూర్తయ్యాక తదుపరి డీసీసీబీలకు, టెస్కాబ్‌కు ఎన్నికలు నిర్వహిస్తారు. వాటి షెడ్యూల్‌ ఇంకా ఖరారు కాలేదు. ఆ ఎన్నికల్లో డీసీసీబీ, టెస్కాబ్‌లకు చైర్మన్లను ఎన్నుకుంటారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top