‘కర్నాటకం’లో కొత్త మలుపు | No Voting As Governor Deadline Ends in Karnataka | Sakshi
Sakshi News home page

ముగిసిన డెడ్‌లైన్‌; జరగని బలపరీక్ష

Jul 19 2019 1:51 PM | Updated on Jul 19 2019 5:14 PM

No Voting As Governor Deadline Ends in Karnataka - Sakshi

తనను ఒత్తిడికి గురిచేసే వాడు ఇంకా పుట్టలేదని కర్ణాటక స్పీకర్‌ వ్యాఖ్యానించారు.

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కుమారస్వామి ఈరోజు మధ్యాహ్నం 1.30 గంటల్లోగా మెజారిటీ నిరూపించుకోవాలన్న గవర్నర్‌ ఆదేశాలను శాసనసభ పట్టించుకోలేదు. గవర్నర్‌ ఆదేశాల ప్రకారం బలపరీక్ష నిర్వహించేందుకు స్పీకర్‌ కేఈఆర్‌ రమేశ్‌కుమార్‌ తిరస్కరించారు. తనను సుప్రీంకోర్టు, గవర్నర్‌ శాసించలేరని అన్నారు. బలపరీక్షలకు ఆదేశాలు ఇవ్వాలని బీజేపీ సభ్యులు పదేపదే డిమాండ్‌ చేసినా ఆయన తలొగ్గలేదు. తనను ఒత్తిడికి గురిచేసే వాడు ఇంకా పుట్టలేదని వ్యాఖ్యానించారు.

బలపరీక్షపై స్పీకర్‌ ఆదేశాలకు కట్టుబడతానని సీఎం​ కుమారస్వామి తెలిపారు. ‘మధ్యాహ్నం 1.30 గంటల్లోగా బలం నిరూపించుకోవాలని నన్ను స్పీకర్‌ ఆదేశించారు. రెబెల్‌ ఎమ్మెల్యేల రాజీనామాలపై నిర్ణయాధికారాన్ని స్పీకర్‌కే సుప్రీంకోర్టు వదిలిపెట్టింది. ఇప్పటికే నేను అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాను. బలనిరూపణపై నాకు గవర్నర్‌ ఇచ్చిన ఆదేశాలపై స్పీకర్‌ నిర్ణయం తీసుకుంటారు. ఈ అంశాన్ని ఆయనకే వదిలిపెడుతున్నాన’ని కుమారస్వామి అన్నారు.
(చదవండి: యడ్యూరప్ప చేతులు జోడించి వేడుకున్నారు కానీ..)

తాను నిప్పుల కుంపటిపై కూర్చున్నట్టుగా ఉందని అంతకుముందు స్పీకర్‌ కేఆర్‌ రమేశ్‌ కుమార్‌ అన్నారు. గౌరవంతో బతికే తనను కించపరిచే విధంగా కొంత మంది మాట్లాడుతున్నారని వాపోయారు. అసెంబ్లీలో సభ్యులు మాట్లాడే ప్రతి మాట రికార్డవుతుందని హెచ్చరించారు. హడావుడిగా నిర్ణయాలు తీసుకోబోనని, చర్చ తర్వాతే బలపరీక్ష జరుగుతుందని స్పష్టం చేశారు. భోజన విరామం కోసం సభను స్పీకర్‌ మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేయడంతో హైడ్రామా కొనసాగుతోంది.

గవర్నర్‌ ఏమంటారో..?
డెడ్‌లైన్‌ విధించే అధికారం గవర్నర్‌కు ఉంటుందని బీజేపీ నాయకులు వాదిస్తున్నారు. అసెంబ్లీ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం చేసుకోవడం తగదని కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు అంటున్నారు. ఎన్నిరోజులైనా సరే చర్చ కొనసాగించాలి, సభ్యులందరికీ మాట్లాడే అవకాశం కల్పించాలని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. అందరి అభిప్రాయాల తర్వాతే విశ్వాస పరీక్ష జరపాలని సూచించారు. తన నిర్ణయాన్ని స్పీకర్‌ ధిక్కరించిన నేపథ్యంలో గవర్నర్‌ వజూభాయ్‌వాలా ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. (చదవండి: కర్నాటకం క్లైమాక్స్‌ నేడే)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement