ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించలేదు

No discussion on Maharashtra government formation says sharad pawar - Sakshi

మహారాష్ట్రలో రాజకీయ పరిస్థితిని సమీక్షించాం

సోనియాతో భేటీపై పవార్‌

శివసేన నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న ఉత్కంఠ

న్యూఢిల్లీ/ముంబై: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి 26 రోజులు గడుస్తున్నా.. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో నెలకొన్న ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఎన్సీపీ, కాంగ్రెస్‌ల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న శివసేన ఆశలు నెరవేరడం లేదు. తాజాగా, ఢిల్లీలో ప్రెస్‌మీట్‌లో ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ చేసిన నర్మగర్భ వ్యాఖ్యలు ఈ మూడు పార్టీల మధ్య పొత్తు దిశగా అడుగులు పడటం లేదనే సంకేతాలిస్తున్నాయి. శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవడంతో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ మరింత పెరిగింది.

ఢిల్లీలో సోమవారం కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ సమావేశమయ్యారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఏర్పాటుపై ఆమెతో చర్చలు జరపలేదని స్పష్టం చేశారు. మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిస్థితిని సోనియాకు వివరించానన్నారు. ‘మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై వివరంగా చర్చించాం. మహారాష్ట్రలో పరిస్థితులను నిశితంగా గమనిస్తుంటాం. భవిష్యత్‌ కార్యాచరణపై ఎన్సీపీ, కాంగ్రెస్‌ నేతలు చర్చలు కొనసాగిస్తారు’ అని పవార్‌ వివరించారు. ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీకి మద్దతిస్తారా? అన్న ప్రశ్నకు సమాధానం దాటవేసిన పవార్‌.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తమ ప్రధాన ప్రత్యర్థి అన్న విషయాన్ని గుర్తుచేశారు. ‘బీజేపీ, శివసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి.

ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేయడం లేదో ఆ పార్టీలనే అడగండి’ అన్నారు. పవార్‌ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ ప్రారంభమైంది. శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు లేవని, ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేస్తున్నామనేదే పవార్‌ వ్యాఖ్యల అర్థం అని పలువురు విశ్లేషిస్తున్నారు. మరోవైపు, రాజకీయాల్లో ఆరితేరిన పవార్‌.. పొత్తు చర్చల్లో శివసేనపై ఒత్తిడి తెచ్చి, కొత్త ప్రభుత్వంలో పై చేయి సాధించేందుకే ఇలా వ్యాఖ్యానించారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. పవార్‌ తాజా వ్యాఖ్యలపై శివసేన స్పందించలేదు. కానీ, పవార్‌ నివాసంలో ఆయనతో శివసేన నేత సంజయ్‌రౌత్‌ భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘త్వరలో శివసేన నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది’ అని అన్నారు.

మహారాష్ట్ర రైతుల సమస్యలపై ప్రధాని మోదీని కలిసే అఖిలపక్ష బృందానికి నేతృత్వం వహించాలని కోరేందుకు పవార్‌ను కలిశానన్నారు. ఇదిలా ఉండగా, పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. సభలో వ్యవహరించే తీరుపై ఎన్సీపీపై ప్రశంసలు కురిపించడం గమనార్హం.  పార్లమెంట్లో శివసేన సభ్యులకు విపక్ష సభ్యుల వైపు స్థానాలు కేటాయించడంపై సేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ స్పందిస్తూ.. ‘ఎన్‌డీఏ ప్రభుత్వం ఏ ఒక్క పార్టీ సొత్తో కాదు. కానీ, కొందరు  తమను తాము దేవుళ్లుగా భావిస్తుంటారు’ అని వ్యాఖ్యానించారు. నవంబర్‌ 24న అయోధ్య వెళ్లాలనుకున్న శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే.. తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top