నాయకత్వం వహించండి.. వామ్మో నావల్ల కాదు!

Nitish Kumar Rejects RJD Proposal For To lead Opposition - Sakshi

విపక్షాలకు నుంచి నితీష్‌ కుమార్‌కు ఆహ్వానం

సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతున్న విపక్షాలు తమ నూతన సారథి కోసం అన్వేషిస్తున్నాయి. మొన్నటి వరకు ప్రతిపక్షాలకు పెద్ద దిక్కుగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పూర్తిగా తేలిపోయింది. ఆ పార్టీ నేత రాహుల్‌ గాంధీపై పెట్టుకున్న అంచనాలన్నీ తలకిందులయ్యయి. గత ఎన్నికల్లో పార్టీని ముందుండి నడిపించడంలో రాహుల్‌ పూర్తిగా విఫలమయ్యారు. పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ.. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాజీనామా కూడా చేశారు. ఈ నేపథ్యంలో 2024లో దేశవ్యాప్తంగా జరిగే లోక్‌సభ ఎన్నికల కోసం విపక్షాలు ఇప్పటి నుంచే సన్నద్దమవుతున్నాయి. దీనిలో భాగంగానే ప్రతిపక్షాలకు నాయకత్వం వహించాల్సిందిగా  జేడీయూ అధినేత, బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌కు ఆహ్వానం అందింది.

నాయకత్వమా? ఆసక్తిలేదు..
ఈ మేరకు ఆర్జేడీ సీనియర్‌ నాయకుడు శివానందన్‌ తివారీ నితీష్‌ను కోరారు. ‘‘సరైన నాయకుడు లేనందున దేశ వ్యాప్తంగా విపక్షాలు బలహీనపడిపోతున్నాయి. బీజేపీని ఎదుర్కొనేందుకు, మోదీ, అమిత్‌ షాకు ధీటైన నేత ఎవ్వరూ లేరు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతిపక్షాలను ముందుండి సమర్థవంతంగా నడిపించగల నేత కనిపించట్లేదు. ఆ బాధ్యతను మీరు (నితీష్‌) తీసుకోవాలి. దీనికి మా నుంచి పూర్తి సహకారం ఉంటుంది.’అంటూ శివానందన్‌ పేర్కొన్నారు. అయితే దీనిపై నితీష్‌ కుమార్‌ గురువారం నాడు స్పందించారు. తాము ప్రస్తుతం ఎన్డీయే భాగస్వామ్యపక్షంగా ఉన్నామని, విపక్షాల విజ్ఞప్తిపై తనకు అంత ఆసక్తి లేదని తోసిపుచ్చారు. జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలను ఏకం చేసి.. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు తాను సిద్ధంగా లేనని చెప్పినట్లు తెలిసింది. అంతేకాదు తాను ఎన్డీయేలోనే కొనసాగుతామని తెలిపినట్లు సమాచారం.

బీజేపీ వ్యతిరేక దారిలో..
కేంద్రంలో రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మోదీ మంత్రివర్గంలో నితీష్‌ సారథ్యంలోని జేడీయూ చేరలేదన్న విషయం తెలిసిందే.  అలాగే మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ట్రిపుల్‌ బిల్లును కూడా జేడీయూ వ్యతిరేకించింది. ఈ మేరకు రాజ్యసభలో ఓటింగ్‌కు దూరంగా ఉంది. అయితే బీజేపీ వ్యతిరేక ధోరణిలో నితీష్‌ ప్రయాణిస్తున్నారని పసిగట్టిన విపక్ష నేతలు ఆయన్ని తమవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే విపక్షాల తరఫున నాయకత్వం వహించాలని ఆహ్వానం పంపుతున్నారు. మరోవైపు బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు కూడా సమయం దగ్గర పడుతుండడంతో నితీష్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top