బీజేపీతో నితీష్‌ కటీఫ్‌..?

Nitish Kumar Planning To Leave Nda Over Bjps Stand - Sakshi

సాక్షి, పట్నా : బీజేపీతో మరోసారి తెగదెంపులకు బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ సంసిద్ధమవుతున్నారా అనే సంకేతాలు వెల్లడవుతున్నాయి. ఎన్‌డీఏ కూటమిలో బీజేపీతో నితీష్‌ అసౌకర్యంగా ఉన్నారనే వార్తలకు బలం చేకూరుతోంది. జేడీ(యూ)-బీజేపీ మధ్య సంబంధాలు గత రెండు వారాలుగా జరుగుతున్న పరిణామాలతో బెడిసికొట్టాయనే ప్రచారం సాగుతోంది. బీజేపీ పెద్దన్న తీరుతో నితీష్‌ విసిగిపోయారని, ఇటీవల నాలుగు సందర్భాల్లో బీజేపీ వ్యవహరశైలిపై ఆయన గుర్రుగా ఉన్నారని చెబుతున్నారు. నోట్ల రద్దుపై నితీష్‌ యూటర్న్‌ సైతం ఇవే సంకేతాలు పంపుతోంది.

పట్నాలో జరిగిన ఓ బ్యాంకింగ్‌ సదస్సులో పాల్గొన్న నితీష్‌ నోట్ల రద్దును తాను గట్టిగా సమర్ధించానని, అయితే దీనివల్ల ఎంతమంది ప్రజలు లబ్ధిపొందారని ఆయన ప్రశ్నించారు. పలుకుబడి కలిగిన కొందరు సంపన్నులు పెద్దమొత్తంలో సొమ్మును ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించారని, పేదలు మాత్రం నగదు అందుబాటులో లేక ఇ‍బ్బందులు పడ్డారని అన్నారు. విపక్షాలు సైతం ఇదే తరహాలో మోదీ సర్కార్‌ నోట్ల రద్దు నిర్ణయాన్ని తప్పుబట్టాయి.

మరోవైపు వరద సాయంపై బిహార్‌కు రూ 7,363 కోట్లు ప్రకటించిన కేంద్రం తాజాగా కేవలం రూ 1750 కోట్లు మంజూరు చేసి చేతులు దులుపుకోవడం సైతం నితీష్‌కు ఆగ్రహం తెప్పించినట్టు చెబుతున్నారు. అసమ్మతి బాహాటంగా వ్యక్తం చేసే క్రమంలోనే నితీష్‌ కుమార్‌ బిహార్‌కు ప్రత్యేక ప్యాకేజ్‌ డిమాండ్‌ను మళ్లీ తెరపైకి తెచ్చారని భావిస్తున్నారు.2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విపక్షాలు మోదీకి వ్యతిరేకంగా ఏకమవుతున్న నేపథ్యంలో నితీష్‌ వైఖరి ఆసక్తికరంగా మారింది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top