జేడీ(యు)లో నిరశన గళం

Nitish Kumar Gets Advice from Pavan K Varma on Citizenship Bill - Sakshi

పట్నా: లోక్‌సభలో పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వడంపై జేడీ(యు)లో నిరసన గళాలు విన్పిస్తున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ ఉపాధ్యక్షుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ అసంతృప్తి వ్యక్తం చేయగా.. జాతీయ అధికార ప్రతినిధి పవన్‌ కే వర్మ కూడా తాజాగా నిరసన గళం విప్పారు. పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతుపై పునరాలోచన చేయాలని జేడీ(యు) జాతీయ అధ్యక్షుడు, బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌కు వర్మ సూచించారు. ‘పౌరసత్వ సవరణ బిల్లు(#CAB2019)కు రాజ్యసభలో మద్దతు ఇచ్చే విషయంలో మరోసారి ఆలోచించాలని నితీశ్‌ కుమార్‌ను కోరుతున్నాను. ఈ బిల్లు రాజ్యాంగం విరుద్ధంగా, వివక్షతో పాటు దేశ ఐక్యమత్యం, సౌభ్రాతృత్వానికి వ్యతిరేకంగా ఉంది. జేడీ(యు) లౌకిక సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉంది. గాంధీజీ ఈ బిల్లును గట్టిగా వ్యతిరేకించార’ని పవన్‌ కే వర్మ మంగళవారం ట్వీట్‌ చేశారు. జేడీ(యు)కు లోక్‌సభలో 16 మంది, రాజ్యసభలో 6 మంది ఎంపీలు ఉన్నారు.

కాగా, మత ప్రాతిపదికన పౌరసత్వం కల్పించే పౌరసత్వ సవరణ బిల్లుకు తమ పార్టీ మద్దతు ఇవ్వడం నిరాశ కలిగించిందని ప్రశాంత్‌ కిషోర్‌ వ్యాఖ్యానించారు. అయితే ఈ బిల్లుకు లౌకికవాదానికి వ్యతిరేకంగా లేదనందువల్లే తాము మద్దతు ఇచ్చామని జేడీ(యు) ఎంపీ రాజీవ్‌ రంజన్‌ అలియాస్‌ లాలన్‌ సింగ్‌ లోక్‌సభలో చెప్పారు. దేశంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బిల్లును సమర్థించడం మినహా తమకు మరో మార్గం లేదని జేడీ(యు) సీనియర్‌ నేత ఒకరు వ్యాఖ్యానించారు.

ఎన్‌ఆర్‌సీ, పౌరసత్వ బిల్లును మొదటి నుంచి వ్యతిరేకించి చివరకు జేడీ(యు) మద్దతు పలకడం తమకు ఆశ్చర్యం కలిగించలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ‘యూటర్న్‌ తీసుకోవడం జేడీ(యు)కు కొత్త కాదని, గతంతో మూడు సార్లు ఈవిధంగా చేసింది. ట్రిఫుల్‌ తలాక్‌, ఆర్టికల్‌ 370 రద్దు సమయంలో ఎలా వ్యవహరించిందో ఇప్పుడు పౌరసత్వ బిల్లుపై అదే విధంగా ప్రవర్తించింది. బీజేపీ ప్రవేశపెట్టిన అంశాలను వ్యతిరేకిస్తున్నట్టుగా ప్రజలు, ఓటర్లలో భ్రమలు కల్పిస్తుంది. చివరకు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఓటింగ్‌ దూరంగా ఉండటమో లేదా సమర్థించమో చేస్తుంద’ని ఏఎన్‌ సిన్హా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ స్టడీస్‌ రాజకీయ విశ్లేషకుడు డీఎం దివాకర్‌ పేర్కొన్నారు. (మా పార్టీ వైఖరిపై నిరాశ చెందా : పీకే)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top