అయ్యా.. ఎన్నికలు 2024లో కాదు!

Netizens Series On Mahakutami Over Telangana Elections 2018 - Sakshi

మహాకూటమిపై కుళ్లు జోకులు

సాక్షి, హైదరాబాద్‌ :  ఇదిగో.. అదిగో అంటూ ఊరిస్తూ వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ.. ఆ పార్టీ నేతృత్వం వహిస్తున్న మహాకూటమి ఇంతవరకు అభ్యర్థులను ప్రకటించకపోవడం ఇటు రాజకీయ పరిశీలకులనే కాదు.. అటు నెటిజన్లను సైతం విస్మయపరుస్తోంది. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తన వ్యూహంలో భాగంగా.. హఠాత్తుగా ముందస్తు ఎన్నికలకు సిద్ధపడటం.. ప్రతిపక్ష పార్టీలకు ఒక రకంగా షాక్‌ ఇచ్చింది. ఈ షాక్‌లో నుంచి తేరుకొని.. టీఆర్‌ఎస్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌ పార్టీ.. టీడీపీ, టీజేఎస్‌, సీపీఐలతో కలిసి మహాకూటమిగా జతకట్టింది. తన మౌలిక విలువలను సైతం పక్కనబెట్టి.. టీడీపీతో అంటకాగేందుకు సిద్ధపడింది. ఇంతవరకు బాగానే ఉంది. కూటమిగా జతకట్టి కూడా చాలారోజులు అవుతోంది. ఒకవైపు ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. సోమవారం నోటిఫికేషన్‌ కూడా వెలువడింది. నామినేషన్‌ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అధికార పక్షమైన టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారంలో దూసుకెళుతూ.. పార్టీ అభ్యర్థులకు బీఫారాలు పంపిణీ చేసి.. ఏకంగా నామినేషన్లు కూడా వేసేస్తుండగా.. కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికీ అభ్యర్థుల ఖరారు విషయంలో మీనమేషాలు లెక్కబెడుతోంది.

ఇప్పటికీ టికెట్ల సర్దుబాటు వ్యవహారాన్ని తేల్చకుండా.. ఇదిగో.. అదిగో ముహూర్తం అంటూ ఊరిస్తోంది. ఓవైపు ఆశావహులు టికెట్‌ కోసం చేస్తున్న ఆందోళనలతో గాంధీభవన్‌ అట్టుడికిపోతుండగా.. మరోవైపు టికెట్‌ కోసం కొందరు నేతలు ఏకంగా ఢిల్లీకి వెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌లో భారీగా ఆశావహులు ఉండటం.. మహాకూటమిలో భాగంగా కొన్ని సీట్లు మిత్రపక్షాలకు వదులుకోవాల్సి రావడంతో ఆ పార్టీ ఒక పట్టాన అభ్యర్థుల ఖరారు అంశాన్ని తేల్చలేకపోతోంది. మరోవైపు భాగస్వామ్య పార్టీలకు ఇచ్చే సీట్లపైన క్లారిటీ ఇవ్వలేకపోయింది. ఇన్నాళ్లు కూటమిలో తీసుకుంటామంటూ సీపీఐని ఊరిస్తూ వచ్చిన కాంగ్రెస్‌.. ఇప్పుడా పార్టీకి మూడు స్థానాలు మాత్రమే ఇస్తామని, ఇష్టమైతే ఉండొచ్చు లేకపోతే కామ్రేడ్లు తెగదెంపులు చేసుకోవచ్చునని తెగేసి చెప్తోంది. ఇలా ఇటు అభ్యర్థుల జాబితా ప్రకటన విషయంలో.. అటు భాగస్వామ్య పక్షాలకు సీట్ల పంపిణీ విషయంలో ఎటూ తేల్చలేకపోతున్న కాంగ్రెస్‌ పార్టీ తీరుపై.. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై సోషల్‌ మీడియాలో సైటెర్లు బాగానే పేలుతున్నాయి.

కాంగ్రెస్‌ తీరుపై నెటిజన్లే కాదు.. కూటమి పెద్ద మనిషి కోదండరామ్‌ కూడా గుస్సా అయ్యారు. ‘మనపై సోషల్‌ మీడియాలో జోకులు పేలుతున్నాయయ్యా? తొందరగా ఆ సీట్ల పంపకం ఏదో తేల్చండి’ అంటూ మీడియా వేదికగానే ఆయన ఘాటుగా కాంగ్రెస్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు. కూటమి సమన్వయకర్తగా ఉన్న కోదండరామే అలా మాట్లాడితే.. నెటిజన్లు ఊరుకుంటారా? ఇదే పాయింట్‌ పట్టుకొని కూటమిపై పంచ్‌లు విసురుతున్నాయి. ‘ఒక్కతాన కూర్చుని సీట్లు పంచుకోనోళ్లు.. రేపు ఒక్కటిగా రాష్ట్రాన్ని ఏం పాలన చేస్తారయ్యా? ’ అని  మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేయగా.. ‘అయ్యా కాంగ్రెస్‌, మహాకూటమి పెద్దమనుషులు.. ఎన్నికల ఫలితాల తర్వాత జాబితా ప్రకటిస్తారా ఏంటి?.. 2024లో ఎన్నికలనుకుంటున్నారా? ’ అని నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ‘ఇట్ల చేస్తే మేం ఓటెయ్యంపో’ అని చురకలు అంటిస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top