తదుపరి ప్రధాని : మోదీకే జనం జేజేలు

NDA Loses Sheen But Narendra Modi Shines Bright - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తదుపరి ప్రధానిగా అత్యధిక మంది ప్రధాని నరేంద్ర మోదీవైపే మొగ్గుచూపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అతికష్టం మీద ఎన్‌డీఏ అధికార పగ్గాలు చేపడుతుందని వెల్లడైనా తదుపరి ప్రధానిగా ప్రజలు మోదీపైనే మక్కువ చూపుతున్నారని ఈ ఏడాది జులైలో మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ పేరిట నిర్వహించిన ఇండియా టుడే సర్వేలో వెల్లడైంది.

తదుపరి ప్రధానిగా మోదీకి ప్రజాదరణ 49 శాతం కాగా, రాహుల్‌ గాంధీకి ప్రజాదరణ 27 శాతంగా ఉంది. ప్రధాని రేస్‌లో నిలిచిన వీరిద్దరిలో మోదీవైపే ప్రజలు విస్పష్టంగా మొగ్గుచూపగా ప్రియాంక గాంధీవైపు మూడు శాతం మంది మొగ్గుచూపారు. భారత ఉత్తమ ప్రధానిగా మోదీ తన స్ధానాన్ని పదిలపరుచుకున్నారు.

ఇక ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్‌డీఏ అతికష్టం మీద అధికార పగ్గాలు చేపడుతుందని, బీజేపీ మేజిక్‌ ఫిగర్‌కు దూరంగా నిలుస్తుందని ఈ సర్వే వెల్లడించింది. అటు బీజేపీ, ఇటు ఎన్‌డీఏ ప్రతిష్ట పలుచబడినా మోదీ ఇమేజ్‌ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్‌డీఏకు కలిసిరానుంది.

మోదీకి ప్రత్యామ్నాయం రాహుల్‌..
తదుపరి ప్రధానిగా కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ కంటే నరేంద్ర మోదీవైపే 23 శాతం అధికంగా ప్రజలు మొగ్గుచూపినా, మోదీకి ప్రత్యామ్నాయం రాహుల్‌ గాంధీయేనని ఈ సర్వే వెల్లడించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయ నేతగా రాహుల్‌ మెరుగైన ఎంపికని 46 శాతం మంది తేల్చిచెప్పారు. మోదీకి బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ప్రత్యామ్నాయమని సర్వేలో పాల్గొన్న వారిలో 8 శాతం మంది అభిప్రాయపడ్డారు.

మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరం, ప్రియాంక గాంధీల వైపు ఆరు శాతం మంది మొగ్గుచూపారు. ఇక నాలుగు శాతం ఓట్లతో ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌లు తర్వాతి స్ధానంలో నిలిచారు. ఇక మతపరంగా చూస్తే  47 శాతం ముస్లింలు, 45 శాతం హిందువులు మోదీకి ప్రత్యామ్నాయ నేతగా రాహుల్‌ను ప్రతిపాదించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top