ఆ సీటు ఎటు?

Nayani Narsimha Reddy Demands Musheerabad Ticket - Sakshi

ముషీరాబాద్‌ కోసం నాయిని, గోపాల్‌

సీటు వదిలేది లేదంటున్న నాయిని

ముఠా గోపాల్‌ వైపే సీఎం మొగ్గు?

కేసీఆర్‌తో నాయిని భేటీ నేడే..

సనత్‌నగర్‌ కోసం కాంగ్రెస్, టీడీపీ పట్టు  

'రాహుల్‌’ కోర్టులో ఫైనల్‌ నిర్ణయం

సాక్షి,సిటీబ్యూరో: రెండు నెలలుగా నగర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా నలుగుతున్న ముషీరాబాద్‌ స్థానాన్ని టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఎవరికి కేటాయిస్తుందన్నది శనివారం తేలనుంది. వాస్తవానికి సెప్టెంబర్‌ 6వ తేదీనే ఈ నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించాలని భావించినా, నాయిని నర్సింహారెడ్డి అభ్యంతరాలతో ప్రకటన నిలిచిపోయింది. ‘ముషీరాబాద్‌తో నలభై ఏళ్ల అనుబంధం నాది. ఈ ఎన్నికల్లో నేను సూచిస్తున్న వ్యక్తికి టికెట్‌ ఇవ్వాలి. అతడికి ఇవ్వడం కుదరకపోతే స్వయంగా నేనే మళ్లీ పోటీ చేస్తా’ అని గతంలోనే హోంమంత్రి నాయినిప్రకటించారు. అనంతరం ముషీరాబాద్‌ స్థానాన్ని తన సమీప బంధువు, కార్పొరేటర్‌ శ్రీనివాసరెడ్డికి ఇవ్వాల్సిందేనంటూ పలు సందర్భాల్లో నాయిని ప్రకటిస్తూ వచ్చారు.

కొన్ని సందర్భాల్లో సీఎం తనకు సమయం ఇవ్వడం లేదని కూడా వాపోయారు. నగరంలో అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం, మరో వైపు నామినేషన్ల దాఖలు గడువు ముంచుకొస్తుండడంతో శనివారం అభ్యర్థిని తేల్చేయాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించినట్లు సమాచారం. ముషీరాబాద్‌ స్థానాన్ని తన అల్లుడికి ఇవ్వడం కుదరకపోతే తానే పోటీ చేయాలన్న నిర్ణయంతోనే నాయిని నర్సింహారెడ్డి ఉన్నట్లు సమాచారం. అయితే, ఈ సీటును మాత్రం గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన ముఠా గోపాల్‌కే ఇచ్చేందుకు సీఎం ఉన్నట్టు సమాచారం. శనివారం సీఎం కేసీఆర్‌తో నాయిని భేటీకానున్నారు. ఈ చర్చల్లో నాయిని కోరికకు అనుగుణంగా టీఆర్‌ఎస్‌ అధినేత గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తారా..?, లేక సామాజిక సమీకరణల్లో భాగంగా ఇప్పటికే నిర్ణయించినట్టు ముఠా గోపాల్‌కే ఓకే చెబుతారా..? అన్నది తేలాల్సి ఉంది. 

ప్రజా కూటమిలోనూ.. ఆ ఒక్కటి
నగరంలోని ఒక్క సీటు అంశం ప్రజా కూటమిలోనూ గందరగోళం రేపుతోంది. సనత్‌నగర్‌ స్థానాన్ని టీడీపీ బలంగా కోరుకుంటుండగా దానికి బదులు సికింద్రాబాద్‌ ఇస్తామని కాంగ్రెస్‌ ప్రతిపాదిస్తోంది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. సనత్‌నగర్‌లో టీడీపీ అభ్యర్థిగా కూన వెంకటేష్‌గౌడ్‌ను పోటీ చేయించే లక్ష్యంతో పార్టీ నేతలు పావులు కదపగా, సనత్‌నగర్‌లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి ఉండడంతో కాంగ్రెస్‌ పార్టీ ఏ నిర్ణయం తీసుకోలేక నిర్ణయాన్ని పార్టీ అధినేతరాహుల్‌గాంధీకి వదిలేసింది. అయితే, ఈ స్థానం నుంచి మళ్లీ మర్రి శశిధర్‌రెడ్డియే పోటీ చేస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఢిల్లీలో గంట గంటకు పరిణామాలు మారిపోతున్నాయి. దీంతో ఈ నియోజకవర్గాన్ని అధికారికంగా ప్రకటించేంత వరకుఉత్కంఠే కొనసాగనుంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top