ఈ మధ్య ‘అవినీతి’ అనడం లేదేం?

Narendra Modi will also waive remaining loan of select industrialists - Sakshi

మోదీపై రాహుల్‌ విసుర్లు

ఆ చౌకీదార్‌ను ప్రజలు దొంగ అంటున్నారు

మధ్యప్రదేశ్‌ ప్రచారంలో ప్రధాని మోదీపై మండిపాటు

భోపాల్‌: గతంలో ప్రతిచోటా అవినీతి గురించి మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు మాత్రం ఆ మాట ఎత్తడం లేదని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. ‘56 అంగుళాల ఛాతీ గురించి మాట్లాడిన మోదీ తనను తాను అవినీతి జరగకుండా కాచుకునే కాపలాదారుడినని చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు అవినీతి నిర్మూలనపై నోరు మెదపడం లేదు. ఇప్పుడు మోదీ చౌకీదార్‌ అని అంటే, ప్రజలు వెంటనే ఆ చౌకీదార్‌ దొంగ అని అంటున్నారు’ అని శుక్రవారం మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లా దియోరిలో జరిగిన ర్యాలీలో ఎద్దేవా చేశారు. నోట్ల రద్దు దేశంలోనే అతిపెద్ద కుంభకోణం అని అభివర్ణించారు. మేకిన్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా లాంటి పథకాలు ప్రారంభించినా కూడా ఎన్డీయే హయాంలో రోజుకు 450 ఉద్యోగాల్నే సృష్టిస్తున్నారని, అదే సమయంలో చైనాలో అయితే సుమారు 50 వేల ఉద్యోగాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు.  
 
వ్యాపారవేత్తలకే మరింత ‘మాఫీ’..

ఇప్పటికే కొందరు పారిశ్రామికవేత్తలకు రూ.3.5 లక్షల కోట్ల రూపాయల్ని మాఫీచేసిన ప్రధాని నరేంద్ర మోదీ..త్వరలోనే మిగిలిన రూ.12 లక్షల కోట్లను కూడా రద్దుచేస్తారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మండిపడ్డారు.  ‘ఓసారి మోదీని కలిసి రైతు రుణమాఫీ గురించి అడిగితే ఆయన నోరు మెదపలేదు. కానీ తనకు సన్నిహితులైన పారిశ్రామికవేత్తలకు మాత్రం రూ.3.5 లక్షల కోట్ల రుణాల్ని మాఫీ చేశారు. ఇంకా చెల్లించాల్సి ఉన్న రూ.12 లక్షల కోట్ల రూపాయల్ని కూడా నెమ్మదిగా రద్దుచేస్తారు.

నోట్లరద్దు సమయంలో ప్రజలంతా బ్యాంకుల ముందు క్యూలు కడితే..విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీ లాంటి వారు ప్రజాధనంతో దేశం దాటి వెళ్లేలా మోదీ అనుమతించారు. అప్పుడు అంబానీ లాంటి పారిశ్రామికవేత్తలు క్యూలో నిల్చోవడం చూశారా?’ అని ప్రశ్నించారు. పంజాబ్, కర్ణాటకలలో మాదిరిగా అధికారంలోకి వస్తే మధ్యప్రదేశ్‌లోనూ 10 రోజుల్లోనే రైతు రుణాల్ని మాఫీచేస్తామని హామీ ఇచ్చారు. ఒకవేళ కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి 10 రోజుల్లోనే ఈ హామీని అమలుచేయకుంటే, ఆయన్ని పదవి నుంచి తొలగిస్తామని చెప్పారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top