మరి, ఆ ట్రంకు పెట్టె ఏమయింది?

 Narend modi chopper controversy - Sakshi

ఈసీ వర్గాలను ప్రశ్నించిన కాగ్‌

సాక్షి, న్యూఢిల్లీ : ‘కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమార స్వామి వాహనాలను అనేక సార్లు తనిఖీ చేశారు. అలాగే ఒడిశా ముఖ్యమంత్రి వాహనాలను తనిఖీ చేశారు. మరి వారి వాహనాలను తనిఖీ చేసిన అధికారులపై ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు?’... ప్రధాని నరేంద్ర మోదీ హెలికాప్టర్‌ను ఏప్రిల్‌ 16వ తేదీన తనిఖీ చేశారన్న కారణంగా మొహమ్మద్‌ మెహిసిన్‌ అనే ఐఏఎస్‌ అధికారిని సస్పెండ్‌ చేయడం పట్ల ‘సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌ (కాగ్‌)’కు చెందిన బెంగళూరు బెంచ్‌ గురువారం ఎన్నికల కమిషన్‌ వర్గాలను ఉద్దేశించిన వేసిన ప్రశ్న ఇది.

ఎన్నికల సమయంలో ‘ఎస్పీజీ (స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌)’ భద్రత ఉన్న వారి సముచిత భద్రత గురించి ఆలోచించాల్సిందే. అంతమాత్రాన తమ ఇష్టానుసారం నడుచుకునే అధికారం వారికుందని భావించరాదు. ఐఏఎస్‌ అధికారుల బ్లూ బుక్‌ ప్రకారం ఎస్పీజీ పరిరక్షణలో ఉన్న వారి విషయంలో ఎలాంటి మార్గదర్శకాలు ఉన్నాయో, వాటి జోలికి మేము పోదల్చుకోలేదు. చట్టం ఎవరికైనా వర్తించాల్సిందే’ అని వ్యాఖ్యానిస్తూ మెహిసిన్‌ సస్పెన్షన్‌పై స్టే విధించిన విషయం తెల్సిందే. మోదీ కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు ఆయన హెలికాప్టర్‌ నుంచి ఓ నల్ల ట్రంకు పెట్టెను కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో మెహిసిన్‌ ప్రధాని హెలికాప్టర్‌ను ఒడిశాలో తనిఖీ చేయాల్సి వచ్చిందంటూ మెహిసిన్‌ న్యాయవాది చేసిన వాదనను పరిగణలోకి తీసుకున్న ట్రిబ్యునల్, మరి ఆ ట్రంకు పెట్టె విషయంలో ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఎన్నికల కమిషన్‌ వర్గాలను ప్రశ్నించింది. 

ఒడిశాలోని సంబాల్పూర్‌లో ‘జనరల్‌ అబ్జర్వర్‌’ విధులు నిర్వహిస్తున్న మొహిసిన్‌ ప్రధాని హెలికాప్టర్‌ వద్దకు వెళ్లి తనిఖీ చేశారు. ఎస్పీజీ అనుమతితో దూరం నుంచి హెలికాప్టర్‌ వీడియో తీసుకోవాల్సిందిగా వీడియో గ్రాఫర్‌కు చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోయారు. అనంతరం, ఎస్పీజీ రక్షణ ఉన్న ప్రధానికి ఇలాంటి తనిఖీల నుంచి మినహాయింపు ఉంటుందని, అది తెలియకుండా ఐఏఎస్‌ అధికారి తనీఖీ చేశారంటూ ఎస్పీజీ అధికారులు జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయగా, సబార్డినేట్‌ రూల్స్‌ను అతిక్రమించారంటూ మెహిసిన్‌ను అదే రోజు సస్పెండ్‌ చేశారు. 

ఎన్నికల సమయంలో భద్రతరీత్యా ప్రధానికి ప్రభుత్వ వాహనాలను ఉపయోగించే అధికారం ఉందిగానీ, తనిఖీల నుంచి మినహాయింపు ఉన్నట్లు 2014, 2019 నాటి ఎన్నికల కోడ్‌లలో ఎక్కడా లేదు.  23వ తేదీన మూడవ విడత పోలింగ్‌ ముగిసేవరకు నిరీక్షించిన మొహిసిన్‌ తన సస్పెన్షన్‌ను సవాల్‌ చేస్తూ ఎన్నికల కమిషన్‌ అధికారులకు ఈ మెయిళ్లు పంపించారు. వాటికి ఎలాంటి సమాధానం లేకపోవడంతో గురువారం ఉదయం ఆయన ట్రిబ్యునల్‌ను సంప్రతించారు. సాయంత్రం స్టే ఉత్తర్వులు జారీ చేసిన కాగ్‌ కేసు తదుపరి విచారణను జూన్‌ మూడవ తేదీకి వాయిదా వేసింది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top