నారా లోకేష్‌ వ్యాఖ్యలపై పేలుతున్న సెటైర్లు | Sakshi
Sakshi News home page

భృతితో సెల్‌ కొనుక్కొని జల్సా చేయొద్దు

Published Wed, Aug 8 2018 1:20 PM

Nara Lokesh Comments On Unemployment benefit In Guntur - Sakshi

సాక్షి, గుంటూరు, మాచర్ల రూరల్‌: యువకులు రూ.1000 భృతితో సెల్‌ఫోన్‌ కొనుక్కొని ఇంట్లో పడుకొని జల్సా చేయవద్దని మంత్రి పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నారా లోకేష్‌ వ్యాఖ్యానించారు. దీంతో అక్కడే ఉన్న యువత రూ.1000 భృతితో సింగపూర్‌ పర్యటన కూడా చేస్తామంటూ హేళన చేశారు. మంగళవారం దుర్గి మండలం ముటుకూరులో ఏర్పాటు చేసిన గ్రామదర్శిని కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ పథకాల లబ్ధిదారులైన సాధికార మిత్ర, చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లికానుక, ఉపాధి మేట్లతో మాట్లాడించారు. వారికి ముందుగానే అధికారులు తర్ఫీదు ఇచ్చారు.

ఎంత కూలి వస్తుందో తెలియదు
సత్యవాణి అనే ఉపాధి మేట్‌ను రోజుకు ఎంత వేతనం వస్తుందని అడుగగా ఆమె తెలియదని చెప్పడంతో మంత్రి లోకేష్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా డ్వామా పీడీ పులి శ్రీనివాస్‌ను పిలిచి వివరాలు అడిగారు. మరొక మహిళ కోటేశ్వరి తాను ఇంజినీరింగ్‌ పూర్తి చేశానని, ఈ ప్రాంతంలో సాంకేతిక పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలో 720 పెద్ద పరిశ్రమలు వచ్చాయని, వాటి ద్వారా 2 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించామని ఆయన చెప్పుకొచ్చారు. నిరుద్యోగ భృతి రూ.1000 ఇస్తున్నామని చెప్పారు. దీంతో ఆ యువతి అసహనం వ్యక్తం చేశారు.

రానున్న రోజులు ఎన్నికల సమయమని, బీజేపీ వారు రాయలసీమ డిక్లరేషన్, సినీనటుడు పవన్‌కళ్యాణ్‌ ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రమంటూ ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ముటుకూరు గ్రామానికి 4 కిలోమీటర్ల సీసీ రోడ్డు, మించాలపాడు, ముటుకూరు, కోలగుట్ల, శివలింగాపురం, నెహ్రూనగర్, మంగాపురం తండా లింకు రోడ్లకు రూ.కోటి నిధులు మంజూరు చేస్తున్నామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, జీవీ ఆంజనేయులు, నియోజకవర్గ ఇన్‌చార్జి కొమ్మారెడ్డి చలమారెడ్డి, కలెక్టర్‌ కోన శశిధర్, జేసీ ఇంతియాజ్‌ అహ్మద్, జేసీ–2 విజయచందర్‌ తదితరులు పాల్గొన్నారు.

పాత్రికేయులు నేలపైనే..
పాత్రికేయుల కోసం ఏర్పాటు చేసిన ప్రెస్‌ గ్యాలరీ సభా వేదికకు మూలన ఉండటంతో కార్యక్రమం పర్యవేక్షించేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ విషయంపై అడిగేందుకు వచ్చిన పత్రికా ప్రతినిధులను అక్కడే ఉన్న కార్పెట్‌పై కింద కూర్చోవాలని మంత్రి సైగ చేశారు. విధి లేక కిందనే కూర్చొని న్యూస్‌ కవరేజ్‌ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ హడావుడిలో జేబు దొంగలు తమ చేతికి పని చెప్పారు. ముగ్గురు రిపోర్టర్ల జేబులకు కత్తెర వేసి రూ.24 వేలు దొంగిలించారు.

1/1

సావనీర్‌ను ఆవిష్కరిస్తున్న మంత్రులు, అధికారులు

Advertisement
Advertisement