లోకేశ్ వ్యాఖ్యలు.. టీడీపీలో అలజడి

Nara Lokesh Comments Causes Rift In TDP - Sakshi

సాక్షి, కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ మరోసారి తన ‘ప్రత్యేకత’ చాటుకున్నారు. ఈసారి సొంత పార్టీ నాయకులనే గందరగోళంలో పడేశారు. బహిరంగ వేదికలపై నోటికొచ్చినట్టు మాట్లాడి నవ్వులపాలు కావడం ‘చినబాబు’కు ముందునుంచి అలవాటు. తాజాగా కర్నూలులోనూ ఇదే విన్యాసాన్ని పునరావృతం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు టీడీపీలోనే దుమారం రేపాయి.

రెండు రోజుల పర్యటన నిమిత్తం లోకేశ్‌ సోమవారం కర్నూలు జిల్లాకు వచ్చారు. వచ్చిరాగానే తన వ్యాఖ్యలతో టీడీపీ శ్రేణులను అయోమయంలోకి నెట్టారు. కర్నూలు జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా ఎస్వీ మోహన్ రెడ్డిని ఎంపీగా బుట్టా రేణుకను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. లోకేశ్‌ వ్యాఖ్యలకు వేదికపై ఉన్న టీజీ వెంకటేష్‌ సహా అంతా నిశ్చేష్టులయ్యారు. కర్నూలు అసెంబ్లీ సీటు కోసం టీజీ వెంకటేష్‌, ఎస్వీ మోహన్ రెడ్డి వర్గాల కొన్నాళ్లుగా ఆధిపత్య పోరు సాగుతోంది. తన కుమారుడు టీజీ భరత్‌కు ఎలాగైనా ఈ సీటు ఇప్పించాలని టీజీ వెంకటేష్‌ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉరుములేని పిడుగులా వచ్చి లోకేశ్‌ ప్రకటన చేయడంతో టీజీ వర్గం అవాక్కైంది. హడావుడిగా ప్రకటన చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని టీజీ వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఫిరాయింపుదారులైన ఎస్వీ మోహన్‌రెడ్డి, బుట్టా రేణుకలకు టిక్కెట్లు ఎలా ఇస్తారని తెలుగు తమ్ముళ్లు మథనపడుతున్నారు. ఏళ్లకు ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న వారిని నట్టేటా ముంచుతారా అని వాపోతున్నారు. ఎవరి మద్దతు ఇవ్వాలో తెలియక టీడీపీ కార్యకర్తలు గందరగోళంలో పడిపోయారు.

లోకేశ్‌కు విద్యార్థి సంఘాల సెగ
మెడికల్ కౌన్సిలింగ్‌లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ కర్నూలు రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహం వద్ద నారా లోకేశ్‌ కాన్వాయ్‌ను  విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకున్నారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న్యాయం కోసం మంత్రి వద్దకు వస్తే పోలీసులు దురుసుగా వ్యవహరించారని  విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top