సాక్షి, అనంతపురం: రాష్ట్రంలో రెడ్‌బుక్ అరాచకాల వల్లే ఏపీకి పెట్టుబడులు రావడం లేదన్నారు మాజీ మంత్రి సాకే శైలజానాథ్. రెడ్‌బుక్‌లో జనసేన నేతల పేర్లు కూడా ఉన్నాయన్నారు. ఎల్లో మీడియా చంద్రబాబు, లోకేష్ భజన చేస్తున్నాయి అంటూ ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు అబద్ధాలను ప్రజలు గుర్తిస్తున్నారు అని చెప్పుకొచ్చారు.
మాజీ మంత్రి సాకే శైలజానాథ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ వెళ్లి ఉత్తి చేతులతో తిరిగి వచ్చారు. చంద్రబాబు పరిస్థితి అప్పు చేసి పప్పు కూడు తిన్నట్లుగా ఉంది. స్పెషల్ ఫ్లైట్లలో వెళ్లి రావటం తప్ప చంద్రబాబు సాధించింది శూన్యం. చంద్రబాబు అబద్ధాలను ప్రజలు గుర్తిస్తున్నారు. ట్రంప్‌తో ఫోటో కోసం చంద్రబాబు ప్రయత్నించారని సమాచారం. డబ్బా కొట్టుకునేందుకు మళ్లీ రెడీ అవుతున్నారు. అందరినీ ట్రంప్ భయపెడితే.. చంద్రబాబుతో ఫోటో దిగేందుకు ట్రంప్ భయపడ్డారట!
ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను రెడ్‌బుక్ ద్వారా నాశనం చేశారు. రెడ్‌బుక్ అరాచకాల వల్లే ఏపీకి పెట్టుబడులు రావడం లేదు. ఎల్లో మీడియా చంద్రబాబు, లోకేష్ భజన చేస్తున్నాయి. దావోస్ నుంచి జీరోల్లా తిరిగి వచ్చామని చంద్రబాబు, నారా లోకేష్ అంగీకరించాలి. 99 పైసలకు చంద్రబాబు, లోకేష్ ఆస్తులు ఇచ్చుకోవాలి. చంద్రబాబు రాష్ట్రంలో ఎమర్జెన్సీ పెట్టి పరిపాలన చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేస్తున్నారు. నిరుద్యోగులకు ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలి. చంద్రబాబు అబద్దాలు చెప్పడం మానుకోవాలి. వైఎస్సార్‌సీపీ హయాంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెట్టింది. చంద్రబాబుకు బ్రాండ్ లేదు. సోషల్ మీడియాలో లైక్, కామెంట్ చేస్తే ప్రభుత్వం సహించలేకపోతుంది. రెడ్‌బుక్‌లో జనసేన నేతల పేర్లు కూడా ఉన్నాయి. కూటమి పాలనలో పోలీసు శాఖ నిర్వీర్యం అయింది అని ఘాటు విమర్శలు చేశారు.


