అమాయకులకు చిత్రహింసలు.. బాబుపై ఆగ్రహం! | Muslim Families Fire on CM Chandrababu | Sakshi
Sakshi News home page

Aug 30 2018 10:56 AM | Updated on Aug 30 2018 11:28 AM

Muslim Families Fire on CM Chandrababu - Sakshi

సాక్షి, నంద్యాల : ముస్లిం మైనారిటీల సంక్షేమం పట్ల టీడీపీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో బయట పడింది. నాలుగున్నరేళ్లుగా తన మంత్రివర్గంలో ముస్లింలకు స్థానం కల్పించ సీఎం చంద్రబాబు.. తన సభలో ఫ్లకార్డులు ప్రదర్శించారనే కారణంతో కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ముస్లిం యువకులను అక్రమంగా అరెస్టు చేయించారు. 2 రోజులుగా పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించి చిత్రహింసలు పెట్టారు. అరెస్టయిన నంద్యాల ముస్లిం యువకుల సమాచారం కూడా వారి బంధువులకు తెలియడం లేదు. దీంతో యువకుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ముస్లింల ద్రోహి చంద్రబాబు అని నిప్పులు చెరుగుతున్నారు.

అమాయకులకు చిత్రహింసలు
గుంటూరులో మంగళవారం నిర్వహించిన ‘నారా హమారా..టీడీపీ హమారా’ సభకు నంద్యాల పట్టణానికి చెందిన ముస్లిం యువకులు మహబూబ్‌ బాషా, అబిద్, అక్తర్‌ సల్మాన్‌ జిగ్రియా, ముర్తుజావలి, మహమ్మద్‌ ఇలియాస్, సౌదిజిబేర్, మహమ్మద్‌ జిబేర్, ముజాహిద్‌ వెళ్లారు. సీఎం చంద్రబాబు ప్రసంగిస్తుండగా.. ముస్లింలకు న్యాయం చేయాలని కోరుతూ వారు  ఫ్లకార్డులు చూపించారు. పోలీసులు వెంటనే 8 మంది ముస్లిం యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సెల్‌ఫోన్లు సైతం లాక్కొని.. యోగక్షేమాలు కూడా తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు తెలియకుండా చేశారు.  ముస్లింలకు అన్నివిధాలా న్యాయం చేయడం అంటే ఇదేనా చంద్రబాబూ? అని నిలదీస్తున్నారు.  

కర్నూలు, నంద్యాలలో ఆందోళన
ముస్లిం యువకుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ బుధవారం రాత్రి కర్నూలు, నంద్యాల పట్టణాల్లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్, నంద్యాల నియోజకవర్గ నేత శిల్పా రవి బాధితుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. తాము అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. అలాగే నంద్యాల పట్టణంలోని శ్రీనివాస సెంటర్‌లో హఫీజ్‌ఖాన్, శిల్పా రవి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బైఠాయించారు. కర్నూలులోని జిల్లా కలెక్టరేట్‌ వద్దనున్న గాంధీజీ విగ్రహం ఎదుట పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్‌ సురేందర్‌రెడ్డి  ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు.

వెంటనే విడుదల చేయాలి
ముస్లింలకు న్యాయం చేస్తామని చేప్పే చంద్రబాబు ఈ రోజు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? నంద్యాల ఉప ఎన్నికలకు వచ్చినప్పుడు చంద్రబాబు టోపీ పెట్టుకొని ముస్లింలపై ప్రేమ ఒలకబోసి ఓట్లు వేయించుకొని ఈ రోజు మా పిల్లలపై ప్రతాపం చూపిస్తున్నాడు. ఇది ఎంతవరకు సబబు? మా పిల్లలను వెంటనే విడుదల చేయాలి. లేదంటే టీడీపీ నాయకులకు బుద్ధిచెబుతాం.
అక్తార్‌ సల్మాన్‌ కుటుంబ సభ్యులు

మా బిడ్డ దేశద్రోహం చేశాడా?
రెండురోజులుగా మాకు నిద్రాహారాలు లేవు. మా బిడ్డ దేశద్రోహం చేశాడా ఇంతలా చిత్రహింసలు పెడుతున్నారు. ఉప ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్న నంద్యాల టీడీపీ నాయకులు దీనిపై ఎందుకు మాట్లాడటం లేదు. ముస్లింలపై అభిమానం ఉంటే 8 మంది యువకులను వెంటనే విడిపించండి. మా పిల్లలను వెంటనే విడుదల చేయాలి.
– ముర్తుజావలి కుటుంబ సభ్యులు

చిత్రహింసలు పెడుతున్నారు
మా కుమారుడిని పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారు. నేను అనారోగ్యంతో చాలా ఇబ్బందులు పడుతున్నా. నా కొడుకుతో ఒకసారి మాట్లాడించాలని వేడుకుంటున్నా. ముస్లింలపై చంద్రబాబు చూపుతున్న ప్రేమ ఇదేనా?                        
– షేక్‌ జిబేరు తండ్రి మహబూబ్‌ బాషా

వాళ్లేం తప్పు చేశారు
ముస్లిం యువకులు ఏం తప్పు చేశారో ప్రభుత్వం చెప్పాలి. నా తమ్ముడు జిగ్రియాను పోలీసులు దారుణంగా కొట్టినట్లు తెలిసింది. వెంటనే మా వాళ్లను విడుదల చేయకపోతే ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి, ఎంపీ ఎస్పీవై రెడ్డి ఇళ్లను ముట్టడిస్తాం.  
జిగ్రియా సోదరుడు జంసిద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement