టీఆర్‌ఎస్‌కు విశ్వేశ్వర్‌ రెడ్డి గుడ్‌బై

MP Konda Vishweshwar Reddy Resignes TRS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్న టీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌ తగిలింది. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి పార్టీకి గుడ్‌బై చెప్పారు. కొన్నాళ్లుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలతో అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీ సభ్యత్వంతో పాటు, ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో తెలంగాణ భవన్‌కు రాజీనామా లేఖను పంపారు. అంతేకాదు ఈనెల 23న సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది.

కేసీఆర్‌కు మూడు పేజీల లేఖ
తన రాజీనామాకు సంబంధించి ఐదు కారణాలతో కూడిన మూడు పేజీల లేఖను టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు విశ్వేశ్వర్‌రెడ్డి పంపించారు. తెలంగాణ వ్యతిరేకులకు కేబినెట్‌లో చోటు కల్పించడం, పార్టీలో తలెత్తిన సమస్యలు పరిష్కరించేందుకు తాను చేసిన ప్రయత్నాలను నీరుగార్చడం, కార్యకర్తలను పట్టించుకోకపోవడం, రెండేళ్లుగా పార్టీ ప్రజలకు దూరమవడం వంటి కారణాల వల్ల టీఆర్‌ఎస్‌ను వీడుతున్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. (‘కాంగ్రెస్‌లోకి ఇద్దరు టీఆర్‌ఎస్‌ ఎంపీలు’)

కాగా, చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చాలా కాలంగా పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన మంత్రి పట్నం మహేందర్‌రెడ్డికి పార్టీలో ఇస్తున్న ప్రాధాన్యతపై ఆయనకు అభ్యంతరాలున్నాయి. తనకు కాకుండా మహేందర్‌రెడ్డికి పార్టీ పెద్దపీట వేస్తుందనే ఆలోచనలో విశ్వేశ్వర్‌రెడ్డి ఉన్నారని ఆయన సన్నిహితులు తెలిపారు. ఈ నేపథ్యంలో విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరతారని నెలరోజుల నుంచి వార్తలు ప్రచారమయ్యాయి.

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి తన ప్రచార సభల్లో ఈ విషయమై ఎన్నోసార్లు లీకులు కూడా ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు కాంగ్రెస్‌లో చేరతారని ఆయన ప్రకటించారు. దీంతో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, కేటీఆర్‌ను రంగంలోకి దించి బుజ్జగింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో తాను పార్టీని వీడటం లేదని విశ్వేశ్వర్‌రెడ్డి చెప్పారు. కానీ మంగళవారం పార్టీని వీడుతున్నట్లు ఆయన ప్రకటించడంతో టీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌ తగినట్లయింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top