పబ్లిసిటీ ఘనం.. మరి పాలన?

Modi Government spent Huge Amount on Publicity - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మూడేన్నరేళ్ల బీజేపీ పాలనలో పబ్లిసిటీ పేరిట పెట్టిన ఖర్చెంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే. సుమారు 3,755 కోట్ల రూపాయలను ఇప్పటిదాకా ఖర్చు చేశారు. సమాచార హక్కు కింద దాఖలు చేసిన ఓ పిటిషన్‌ ఆధారంగా ఈ విషయం వెల్లడైంది. 

ఏప్రిల్‌ 2014 నుంచి అక్టోబర్‌ 2017 దాకా ఎలక్ట్రానిక్‌, ప్రింట్‌ మీడియా, అవుట్‌డోర్‌ పబ్లిసిటీ పేరుతో అక్షరాల 37, 54, 06, 23, 616 రూపాయలను ఖర్చు చేశారు. ఇక విడివిడిగా చూసుకుంటే రేడియో, డిజిటల్‌ సినిమా, దూరదర్శన్‌, ఇంటర్నెట్‌, ఎస్‌ఎంఎస్‌, టీవీ తదితర ఎలక్ట్రానిక్‌ మీడియా అడ్వర్‌టైజ్‌మెంట్ల కోసం 1,656 కోట్లు ఖర్చు చేసింది. 

ప్రింట్‌ మీడియాకొస్తే.. 1,698 కోట్లు, హోర్డింగ్లు, పోస్టర్లు, బుక్‌లెట్లు, క్యాలెండర్లు తదితర  ఔట్‌డోర్‌ అడ్వర్‌టైజ్‌మెంట్ల కోసం 399 కోట్లు కేంద్ర ఖర్చు పెట్టింది. ఒక ఏడాది బడ్జెట్‌ లో ఏదైనా ఓ శాఖ కోసం కేటాయించే నిధుల కంటే ఇది చాలా ఎక్కువ. అంతెందుకు గత మూడేళ్లలో కాలుష్య నివారణ ప్రచారం కోసం కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం 56.8 కోట్లు కావటం విశేషం. 

గతంలో తన్వర్‌ అనే వ్యక్తి సమాచార హక్కు కింద కేంద్ర సాంకేతిక సమాచార శాఖను కోరగా.. జూన్‌ 1, 2014 నుంచి ఆగష్టు 31, 2016 వరకు మోదీ యాడ్స్ కోసం 1100 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినట్లు వెల్లడైంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ తమ పాలన, పథకాల గురించి ప్రచారం చేసిన సమయంలో 526 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా.. బీజేపీ-కాంగ్రెస్‌లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. ఇప్పుడు ఈ విషయం వెలుగు చూడటంతో బీజేపీని ఏకీపడేసేందుకు విపక్షాలు సిద్ధమైపోతున్నాయి. ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి రికవరీ చేయించాలని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top