అంత సీన్‌ లేదు: ఎమ్మెల్యే రోజా

MLA Roja MP Reddappa Went To Chennai South Central Railway Zone - Sakshi

ప్రజలతో మెలగాలి. వారి కష్టసుఖాలను తెలుసుకోగలగాలి. కేవలం సినిమా ఆకర్షణతో సీఎం సీటు ఎక్కేంత సీన్‌ లేదు..అని ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ ఆర్కే రోజా అన్నారు. కష్టనష్టాలకు ఎదురీది, అగ్ర రాజకీయకీయ నేతలకు ఎదురొడ్డి ప్రజలతో మమేకమైన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డే నేటి తరం రాజకీయాలకు ఆదర్శప్రాయుడని ఆమె చెప్పారు.  

సాక్షి, చెన్నై: రైల్వే సమస్యల పరిష్కారం కోసం చిత్తూరు ఎంపీ ఎన్‌ రెడ్డెప్ప, రోజా చెన్నైలోని దక్షిణరైల్వే ప్రధాన కార్యాలయానికి వచ్చారు. నగరి సమస్యల పరిష్కారం కోసం జనరల్‌ మేనేజర్‌ను కలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. రజనీ, కమల్‌ గురించి మీడియా ప్రశ్నించగా, రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు.. ప్రజలు ఎవరిని నమ్మి ఓట్లు వేస్తారో వాళ్లే ముఖ్యమంత్రి అవుతారన్నారు. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు నేను ఉన్నాననే భరోసా ఇవ్వగలగాలి. అలా కాకుండా ఊరికే ఏసీ గదుల్లో ఉంటే సీఎం ఎప్పటికీ కాలేరు. జగన్‌మోహన్‌రెడ్డి అనే వ్యక్తిని లేకుండా చేయడానికి ఎన్నెన్ని చేస్తున్నారో చూస్తున్నాం. ఇన్ని జరిగినా ప్రతిపక్ష నేతగా తొమ్మిదేళ్లు ప్రజల్లోనే ఉన్నారు. ఢిల్లీలో మోదీ, సోనియాగాం«దీ, ఏపీలో చంద్రబాబు ఎవరైనా సరే‡ ప్రజల కోసం ఆయన ఫైట్‌ చేస్తున్నారు. అందువల్లే ఆయన ఇప్పుడు సీఎం అయ్యారు. అలా కాకుండా నేను నటుడిని, నాకు పెద్ద ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ ఉంది.. అనేది ఇప్పుడు లేదు. ఆ రోజులు పోయాయి. సోషల్‌ మీడియాలో ఎవరు, ఏమిటి.. ఎలా అనేది అంతా చూస్తున్నారు. ప్రజలు బాగా తెలివిమంతులు, వారికి తెలుసు ఎవరిని అందలం ఎక్కించాలనేది. జయలలిత కన్నుమూసిన తర్వాత అన్నాడీఎంకే పార్టీ, ప్రభుత్వంæ ఉండదని అనుకున్నారు. గతంలో ఎవ్వరికీ అంతగా తెలియని ఎడపాడి పళనిస్వామి మంచి రాజకీయవేత్తగా, లీడర్‌గా గుర్తింపు పొందారు. వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చేస్థాయికి అన్నాడీఎంకే ఎదిగిందని చెప్పారు.  

నగరి నియోజకవర్గంలో రూ.200 కోట్ల రైల్వే అభివృద్ధి 
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత నాలుగోసారి దక్షిణరైల్వే జనరల్‌ మేనేజర్‌ను కలుసుకున్నాను. గతంలో మూడు సార్లు వచ్చినపుడు అప్పటి జనరల్‌ మేనేజర్లు కూడా తాము చేసిన విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించి రూ.100 కోట్ల విలువైన 75 శాతం పనులు పూర్తిచేశారు. అప్పుడు పెట్టిన ఉత్తరంలో సుమారు మరో రూ.100 కోట్ల పనులు మంజూరై టెండర్ల దశలో ఉన్నాయి. మూడు నెలల్లో టెండర్లు ఖరారై పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. నగరికి, చెన్నైకి అవినావభావ సంబంధం ఉంది. అక్కడ ఎక్కువగా చేనేత కార్మికులు ఉండడం వల్ల వారి వృత్తి రీత్యా చెన్నైకి రావడం జరుగుతోంది. వైద్యసేవల కోసం చెన్నై ఆసుపత్రులకు వస్తుంటారు. ఎముకలు విరిగిపోయిన స్థితిలో రోగులు తమిళనాడు నుంచి ఈసలాపురానికి వస్తూ ఉంటారు. రైళ్లు కూడా ఈ మార్గంలో ఎక్కువగా నడుస్తూ ఉంటాయి. వీరి వల్ల రైల్వేకు ఎంతో ఆదాయం. అందువల్లే మేము అడిగినవన్నీ జీఎం అంగీకరించడం ఆనందంగా ఉంది. తిరుపతి – చెన్నై ఫోల్‌లైన్‌ రోడ్డు వేయకుండానే అధికంగా డబ్బులు వసూలు చేస్తూ రాయపాటి మనుషులు ఇబ్బంది పెట్టడంపై సంబంధితశాఖకు ఫిర్యాదు చేశాం. కేంద్రమంత్రులకు సైతం ఫిర్యాదు చే శాం. నగరి నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న జీఎం, ఇతర అధికారులకు ధన్యవాదాలు. 

అలాంటి సీఎం కావాలని కోరుతున్నారు
జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి వద్ద ఎమ్మెల్యేగా పని చేయడం గర్వంగా చెప్పుకుంటున్నాం. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఇలా ఏ రాష్ట్రానికి వెళ్లినా జగన్‌మోహన్‌ రెడ్డి సీఎం మాకు లేరే అని మాట్లాడుకుంటున్నారు. ఐదు నెలల్లోనే అన్ని చేస్తున్నారంటే, 5 ఏళ్లలో ఎవరూ ఆయన్ను బీట్‌ చేయలేరు. మరో 20 ఏళ్లు జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు అని అన్నారు. 

అబద్ధాల కోరు చంద్రబాబు 
చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతూ చంద్రబాబు నిత్యం అబద్ధాలు చెబుతారు, అన్యాయం చేస్తారు. ఆయన ఎన్ని అబద్ధాలు చెప్పినా, అమరావతిలో సంవత్సరానికి నాలుగు పంటలు పండే భూమిని రైతుల వద్ద నుంచి గుంజేసుకున్నాడు కాబట్టే వారి శాపాలు తగిలాయి అన్నారు. ఇక చంద్రబాబు కోలుకునే ప్రసక్తే లేదు. జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్ర చేసి, ప్రజల కష్టనష్టాలు తెలుసుకుని, ఆయన మేనిఫెస్టోలో ప్రజలకు ఉపయోగపడే విధంగా పెట్టి పథకాలన్నింటినీ ప్రతి ఇంటికీ అందేవిధంగా చేస్తున్నాడు.. కాబట్టి చంద్రబాబు నాయుడు ఆయన దగ్గర గుణపాఠాలు నేర్చుకోవాలి. అబద్ధాలు చెప్పడం ఇప్పటికైనా ఆయన మానుకోవాలన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top