అధికారంలోకి రాగానే తుమ్మిడిహెట్టి

MLA Jeevan Reddy Criticize On KCR Karimnagar - Sakshi

ధర్మారం(ధర్మపురి): అధికారంలోకి రాగానే తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం పూర్తిచేసి తెలంగాణను సస్యశ్యామలం చేస్తామని జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. ధర్మారంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్యాకేజీ 6,7,8 పనులు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలోనే 50 శాతం పనులు పూర్తయినట్లు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీకి ఎక్కడ గుర్తింపు వస్తుందోనని కేసీఆర్‌ వివిధరకాల వ్యక్తులతో ఈ ప్రాజెక్టు పనులు ఎక్కడా చూడలేదని ప్రకటనలు జారీచేయించుకుంటున్నారని ఆరోపించారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం చారిత్రక ఒప్పందంగా చెప్పుకుంటూ ఏర్‌పోర్టు నుంచి ఒంటేలతో ఊరేగి ప్రచారం చేసుకున్న కేసీఆర్‌ ఈ బ్యారేజీని ఎందుకు నిర్మించటం లేదని ప్రశ్నించారు.

ఊరేగి రెండేళ్లు గడిచినా.. బ్యారేజీ వద్ద తట్టెడు మట్టి ఎత్తిపోయలేదన్నారు. బ్యారేజీ నిర్మాణంతో పాటు సుందిళ్ల వద్ద  పనులు చేపడితే ఏడాదిలోగా రైతులకు సాగునీరందేదని అన్నారు. కేసీఆర్‌ అనాలోచిత విధానంతో ప్రజలపై ఆర్థిక భారంతో  పాటు సకాలంలో రైతులకు సాగునీరందకుండా పోయిందన్నారు. తుమ్మిడిహెట్టిని విస్మరించి వర్దా వద్ద నిర్మాణాలు చేస్తామని ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్దా, పెనుగంగల సంగమం ప్రాణహితని తుమ్మిడిహట్టి వద్ద నిర్మాణం చేయకపోతే ఈ నీరంత వృథాగాపోతుందన్నారు. అంతే కాకుండ ఇక్కడ బ్యారేజీ నిర్మిస్తే గ్రావిటీ ద్వారా నీటిని తరలించి ఆర్థిక భారం పడకుండా ఉంటుందని సూచించారు.

పునరాకృతిలో భాగంగా ప్యాకేజీ 6లో అదనంగా ఒక్క మోటారు, 8వ ప్యాకేజీలో అదనంగా మరో రెండు మోటార్లను ఏర్పాటు చేశారని గుర్తుచేస్తూ ‘ఈ బాహుబలి’ ఆలోచన కాంగ్రెస్‌ పార్టీదేనని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తుమ్మిడిహెట్టి వద్ద నిర్మాణం చేసి తెలంగాణలోని లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామన్నారు. మేడారం రిజర్వాయర్‌ ద్వారా గంగాధర, నారాయణపూర్‌ రిజర్వాయర్, కొడిమ్యాల, పోతారం చెరువులలోకి నీటి తరలించే అవకాశం ఉన్నా.. ఎందుకు తరలించటం లేదని ప్రశ్నించారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు ఆవుల శ్రీనివాస్, జెడ్పీ మాజీ చైర్మన్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, పీసీసీ సభ్యుడు మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ శంకర్‌రావు, జెడ్పీటీసీ నార బ్రహ్మయ్య, మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌చైర్మన్‌ పాలకుర్తి రాజేశంగౌడ్, మాజీ ఎంపీటీసీ రేణుకాదేవి, నాయకులు రేండ్ల నరేష్, పెర్క భానేష్, ఆవుల వేణు, వెంకటేష్, మహిపాల్‌ పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top