త్వరలో కొత్త పారిశ్రామిక పాలసీ : గౌతమ్‌రెడ్డి

Minister Mekapati Goutham Reddy Says We Will Bring New Industrial Policy - Sakshi

సాక్షి, అమరావతి :  ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ (ఏపీపీ) మిల్లు ఆంధ్రప్రదేశ్ నుంచి వెనక్కి తరలిపోతుందన్న ప్రచారాన్ని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఖండించారు. పేపర్ మిల్లు వెనక్కి వెళ్లిపోయిందని వస్తున్న కథనాలు అవాస్తవమని స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి దుష్ప్రచారాలతో ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించవద్దని కోరారు. త్వరలోనే పరిశ్రమల శాఖకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేసి ఇలాంటి దుష్ప్రచారాలకు తెరదించి నిజానిజాలేంటో ప్రజల ముందుంచుతామన్నారు. త్వరలోనే కొత్త పారిశ్రామిక విధానం తెస్తామని వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రకాలుగా సౌకర్యవంతమైన ప్రదేశం అని పెట్టుబడిదారులు భావిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని అవినీతిరహిత, పారదర్శక పాలన దిశగా ముందుకు తీసుకెళ్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ నాయకత్వంపై పరిశ్రమల యాజమాన్యాలకు భరోసా ఉందన్నారు. ఇటీవల కేంద్ర విదేశాంగ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన ఔట్ రీచ్ అవగాహన సదస్సులో దిగ్గజ పరిశ్రమలతో పాటు పలు పేరున్న సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచినట్లు మంత్రి వెల్లడించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన రెండు నెలల వ్యవధిలోనే ఏపీఐఐసీకి 800 పరిశ్రమల నుంచి దరఖాస్తులు వచ్చాయని మంత్రి పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు స్వర్గధామంగా తీర్చిదిద్దేదిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. పారదర్శక పారిశ్రామిక విధానాన్ని రూపొందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నష్టం కలిగించని రీతిలో పరిశ్రమలకు సానుకూలమైన విధానాలని ప్రవేశపెడతామని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం తీసుకున్న అస్పష్టమైన విధానాలతో పరిశ్రమలశాఖ రూ.2500 కోట్లు బకాయిలు పడిందని దానివల్ల పెట్టుబడిదారులు గందరగోళంలో పడ్డారన్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చని గత ప్రభుత్వ వైఖరిని ఎలా అర్థం చేసుకోవాలని మంత్రి ప్రశ్నించారు. తమ ప్రభుత్వం ఆ బకాయిలు తీర్చే బాధ్యతను భుజాన వేసుకుందని, అంతేగాక రాబోయే రోజుల్లో ఇలాంటి లోపాయికారి ఒప్పందాలను, ఆచరణయోగ్యంకాని విధానాలను సహించబోమని మంత్రి వెల్లడించారు. 

తమ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, రాయితీలు అందిస్తామని మంత్రి తెలిపారు. తమ ప్రభుత్వ విధానాలు నచ్చి అదాని కంపెనీ కృష్ణపట్నం పోర్టులో రూ.5500 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడమే తమ ప్రభుత్వం పట్ల పరిశ్రమలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు. పరిశ్రమలకు, రాష్ట్ర ప్రయోజనాలకు ఇబ్బంది కలగని రీతిలో తమ ప్రభుత్వం నూతన పాలసీ ప్రకటించేందుకు కొంత సమయం పడుతుందన్నారు.  రెండు మూడు నెలల్లో ప్రకటించే కొత్త పాలసీ వల్ల ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన వారికి ఎలాంటి ఇబ్బంది ఉండబోదని స్పష్టం చేశారు. పరిశ్రమలకిచ్చే రాయితీలు, ప్రోత్సాహకాల వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థికభారం పడుతుందన్నారు. రాయితీలపై స్పష్టతనిచ్చి పారిశ్రామిక వేత్తలను ఆకర్షిస్తామని చెప్పారు. ఐదేళ్లలో చేయాల్సిన పని చేయకుండా ఇప్పుడు కొందరు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రాయితీలు చెల్లించకుండా రాష్ట్రానికి చెడ్డపేరు తీసుకువచ్చిన వారే ఇప్పుడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై  ఆరోపణలు, దుష్ప్రచారాలు చేస్తున్నారని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిశ్రమలు, వాటికిచ్చే ప్రోత్సాహకాలు, రాయితీలు అన్నింటిపై ఆర్థికశాఖ, పరిశ్రమల శాఖ సంయుక్తంగా సమీక్షించిన అనంతరం మార్గదర్శకాలు విడుదల చేస్తామని మంత్రి వెల్లడించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top