వానలొచ్చినా ఏడుపేనా!

Minister Harish Rao Fires On Congress Party - Sakshi

కాంగ్రెస్‌పై మంత్రి హరీశ్‌ ధ్వజం

కాళేశ్వరం అనుమతులు రద్దు చేయించేందుకు కుట్ర

నీళ్ల రాజకీయాలు చేస్తున్నారని మండిపాటు

సాక్షి, సిద్దిపేట: వర్షాలు కురిసి తెలంగాణ ప్రాంతం నీళ్లతో నిండిపోతుంటే కాంగ్రెస్‌ నాయకులు కన్నీళ్లు పెడుతున్నారని నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించాల్సిన నాయకులు ద్రోహులుగా వ్యవహరించడం శోచనీయమన్నారు. కరువుతో అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులను ఆదుకునేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు కడుతుంటే.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చేయించాలని కాంగ్రెస్‌ నేతలు సుప్రీంకోర్టులో కేసు వేశారని పేర్కొన్నారు. మంగళవారం సిద్దిపేటలో సబ్సిడీపై పశువుల పంపిణీ అవగాహన కార్యక్రమానికి హాజరైన మంత్రి కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. ప్రస్తుతం ఎస్సారెస్పీలో ఉన్న 15 టీఎంసీల నీళ్లు తాగడానికే సరిపోతాయని, దీనిని అర్థం చేసుకోలేని కాంగ్రెస్‌ నేతలు రైతులను రెచ్చగొట్టి నీళ్లు విడుదల చేయాలని ఆందోళన చేయించడం సరికాదని హితవు పలికారు.

నీళ్ల రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్‌ కుట్రను వాన దేవుడు చూసి వారికి బుద్ధి చెప్పాలని వర్షాలు కురిపించాడని అన్నారు. ఈ వర్షాలతో చెరువులు, కుంటలు నిండి ప్రాజెక్టుల్లోకి ఉధృతంగా వరద నీరు వస్తోందన్నారు. వాన దేవుడు కూడా ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం నిండి సాగర్‌కు నీళ్లు వస్తున్నాయన్నారు. ఎస్సారెస్పీకి 50 టీఎంసీల నీరు చేరిందని, ఇంకా 2.5 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుందని చెప్పారు. దీంతో నీటి కష్టాలు తొలగిపోయి, ఎస్సారెస్పీ కింద తాగునీరు, సాగు నీటికి ఢోకా ఉండదని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.  

ప్రజలకు ఏది అవసరమో అడగకుండానే సీఎం కేసీఆర్‌ సమకూర్చుతున్నారని, ఆయన చేసే మంచి పనులకు దైవం కూడా మద్దతు పలుకుతుందన్నారు. కాంగ్రెస్‌ నాయకులు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజల మద్దతు లభించదన్నారు. సమావేశంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బి.వెంకటేశ్వర్లు, రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్‌ సోలిపేట రామలింగారెడ్డి, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే ఒడితల సతీష్‌కుమార్‌ పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top