‘మీడియా తప్పుగా ప్రచారం చేసింది’

Media Misinterpreted My Words Says Karnataka CM Kumaraswamy - Sakshi

సాక్షి, బెంగళూరు: జేడీఎస్‌ కార్యకర్తల సమావేశంలో తాను కాంగ్రెస్‌పై, కాంగ్రెస్‌ నేతలపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి స్పష్టం చేశారు. ఆదివారం జరిగిన పార్టీ సన్మాన కార్యక్రమంలో తాను భావోద్వేగానికి గురైన మాట వాస్తవమేనని, అయితే మీడియా అత్యత్సాహంతో తనపై లేనిపోనివి ప్రచారం చేసిందని వాపోయారు. మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరించిందని అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

‘గరళాన్ని కంఠంలో దాచుకున్న శివుడిలా నేను బాధపడుతున్నాను’ అని మీడియా ప్రచురించడం కలచి వేసిందని అన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో తాను సంతోషంగా లేనని చెప్పినట్టు మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవమని అన్నారు. కాగా, ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ముఖ్యమంత్రి ఏడుపుగొట్టు నాటకాలాడుతున్నారని బీజేపీ మండిపడింది. ‘ఆయనో విఖ్యాత నటుడు’అని వ్యాఖ్యానించింది. మరోవైపు జేడీఎస్‌-కాంగ్రెస్‌లో ఎటువంటి లుకలుకలు లేవనీ, తమ ప్రభుత్వం పూర్తికాలం పాటు అధికారంలో కొనసాగుతుందని ఆయా పార్టీ వర్గాలు వెల్లడించాయి.

‘మీ సోదరుడినైన నేను సీఎం కావడంతో మీరందరూ సంతోషంగా ఉన్నారు. కానీ, నేనే.. గరళకంఠుడిలా బాధను దిగమింగుతూ పనిచేస్తున్నాన’ని కుమారస్వామి భావోద్వేగానికి గురైనట్టు ఆదివారం వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top