కూలిన కుమార సర్కార్‌ : బీఎస్పీ ఎమ్మెల్యేపై వేటు

Mayawati Expels BSP MLA N Mahesh - Sakshi

బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీలో మంగళవారం జరిగిన విశ్వాస పరీక్షలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ల సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే. దీంతో సీఎం కుమారస్వామి గవర్నర్‌ వజూభాయ్‌ వాలాను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. అయితే ఈ విశ్వాస పరీక్షకు బీఎస్పీ ఎమ్మెల్యే ఎన్‌ మహేశ్‌ హాజరుకాకపోవడంపై ఆ పార్టీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహేశ్‌ను ఓటింగ్‌లో పాల్గొనాల్సిందిగా బీఎస్పీ అధ్యక్షురాలు మయావతి ఆదేశించిన సంగతి తెలిసిందే. అయినా కూడా మహేశ్‌ ఓటింగ్‌కు గైర్హాజరు కావడంతో అతన్ని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు మయావతి ప్రకటించారు.

‘కుమారస్వామి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటింగ్‌లో పాల్గొనాలనే పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మహేశ్‌ మంగళవారం రోజున సభకు హాజరుకాలేదు. దీనిని పార్టీ హైకమాండ్‌ తీవ్రంగా పరిగణిస్తోంది. తక్షణమే మహేశ్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాన’ని మయావతి ట్విటర్‌లో వెల్లడించారు. అయితే 2018 మే నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ, జేడీఎస్‌లు కూటమిగా బరిలో నిలిచాయి. ఈ కూటమి తరఫున బరిలో నిలిచిన మహేశ్‌ కొల్లెగల నుంచి విజయం సాధించారు. అయితే ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి మెజారిటీ స్థానాలు రాకపోవడంతో కాంగ్రెస్‌, జేడీఎస్‌లు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సంకీర్ణ ప్రభుత్వం తరఫున సీఎంగా ఎన్నికైన కుమారస్వామి తన మంత్రివర్గంలో మహేశ్‌కు స్థానం కల్పించారు. ఆయనకు ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. అయితే కొద్దికాలం పాటు మంత్రిగా కొనసాగిన మహేశ్‌.. 2018 అక్టోబర్‌లో ఆ బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. కానీ కాంగ్రెస్‌, జేడీఎస్‌ సంకీర్ణానికి తన మద్దతు ఉంటుందని తెలిపారు. 

చదవండి : కుమార ‘మంగళం’

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top