రాహుల్‌కు పరీకర్‌ ఘాటు లేఖ

Manohar Parrikar Letter After Rahul Gandhi Visits Him - Sakshi

పణజి: కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నీచమైన రాజకీయాలు చేస్తున్నారని గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పరీకర్‌ దుయ్యబట్టారు. రాజకీయ ప్రయోజనాల కోసమే తనను పరామర్శించటానికి వచ్చారని ఆరోపించారు. ఈమేర​కు బుధవారం రాహుల్‌ గాంధీకి ఆయన లేఖ రాశారు. రఫేల్‌ ఒప్పందం గురించి తమ మధ్య ఎటువంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. ప్రాణాంతక అనారోగ్యంతో బాధ పడుతున్న తనతో ఇలాంటి రాజకీయాలు చేయడం తగదని హితవు పలికారు.

‘ఐదు నిమిషాల పాటు జరిగిన మన భేటీలో రఫేల్‌ ఒప్పందం గురించి ఎక్కడా ప్రస్తావన రాలేదు. మన సమావేశంపై ఈ రోజు మీడియాలో వచ్చిన వార్తలు నన్ను తీవ్ర అసంతృప్తికి గురి చేశాయి. మర్యాదపూర్వక భేటీ పేరుతో వచ్చి దిగజారుడు రాజకీయాలు చేయడం సబబు కాదు. మీ పర్యటన లక్ష్యంపై అనుమానాలు కలుగుతున్నాయి. మీ నిజాయితీపై నా మదిలో ఎన్నో ప్రశ్నలు రేగుతున్నాయ’ని రాహుల్‌కు రాసిన లేఖలో పరీకర్‌ పేర్కొన్నారు. రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో ఎటువంటి అక్రమాలు జరగలేదని, దేశ భద్రతకే పెద్దపీట వేశామని ఆయన స్పష్టం చేశారు.

కాగా, రాహుల్‌ గాంధీ అబద్దాలకోరు అంటూ బీజేపీ నాయకులు, గోవా మంత్రులు ధ్వజమెత్తారు. వ్యక్తిగత పర్యటనలను కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. (గోవా సీఎంతో రాహుల్‌ గాంధీ భేటీ)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top