ప్రజాస్వామ్య విలువలు నాశనం

MANMOHANSING FIRES ON NARENDRA MODI - Sakshi

సర్కారుపై మన్మోహన్‌ ఆరోపణలు

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యం పరిరక్షించాల్సిన విలువలను నిదానంగా, పూర్తిస్థాయిలో నాశనం చేస్తోందని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆరోపించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు ఈ విషయంపై జాతీయస్థాయిలో చర్చ జరగాలన్నారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబల్‌ రాసిన ‘షేడ్స్‌ ఆఫ్‌ ట్రూత్‌’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మన్మోహన్‌ మాట్లాడారు. ‘మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యం పరిరక్షించే విలువలను నిదానంగా పూర్తిస్థాయిలో నాశనం చేస్తోంది. సుపరిపాలన అందించడంలో కీలకమైన జాతీయ సంస్థలు ఎన్నడూలేని స్థాయిలో కొత్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. 

నాలుగేళ్లలో పొరుగుదేశాలతో మన సంబంధాలు దిగజారాయి. దేశాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి శాస్త్ర, సాంకేతికతల వినియోగంలో ప్రభుత్వం విఫలమైంది. మహిళలు, దళితులు, మైనారిటీలు మరింత అభద్రతాభావంలోకి జారిపోతున్నారు. విదేశాల్లో మూలుగుతున్న లక్షల కోట్ల నల్లధనాన్ని వెనక్కి తెస్తామన్న హామీని నెరవేర్చేందుకు కేంద్రం సరైన చర్యలేవీ తీసుకోలేదు. దేశంలోని విశ్వవిద్యాలయాల్లో ఉన్న ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మోదీ ప్రభుత్వం భ్రష్టు పట్టించింది.ఈ అణచివేత చర్యలన్నింటిపై నిజంగా జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఆ చర్చ ఈ రోజు ఇక్కడి నుంచే మొదలవుతుందని నేను ఆశిస్తున్నా’ అని మన్మోహన్‌ తెలిపారు. విపక్షాలు ఏకమైతే ఇక బీజేపీ అధికారంలోకి రావడం కలేనని కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబల్‌ వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top