లోకేశ్‌ పరాజయం : చంద్రబాబుకు షాక్

Mangalagiri Election Results 2019 Alla Won On Nara Lokesh - Sakshi

మంగళగిరిలో ఓడిన నారా లోకేశ్‌

సాక్షి, అమరావతి : మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం ఫలితం వెల్లడైంది. ఉదయం నుంచి అత్యంత ఉత్కంఠ రేకెత్తించిన ఈ నియోజవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, మంత్రి, టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్‌ ఘోర పరాజయం పాలయ్యారు. ఈ స్థానం నుంచి ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి 5312 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. గురువారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత తొలి రౌండు నుంచీ ఆర్కే తన ఆధిక్యతను కనబరిచారు. అయితే, ప్రతి రౌండులోనూ ప్రత్యర్థి లోకేశ్‌కు మధ్య ఓట్ల వ్యత్యాసం తక్కువగా ఉండటంతో ఫలితంపై చివరి వరకు ఉత్కంఠభరిత వాతావరణం ఏర్పడింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో తుది రౌండు లెక్కింపు పూర్తయిన తర్వాత 5312 ఓట్ల ఆధిక్యతతో ఆర్కే జయకేతనం ఎగురవేశారు. 

లోకేశ్‌ ఓటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పెద్ద షాక్‌లా తగిలింది. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన లోకేశ్‌ను ఎలాగైనా గెలిపించి సమీప భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ పగ్గాలను అప్పగించాలన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఉన్నారని అప్పట్లో వార్తలొచ్చాయి. ఎన్నికల్లో ఓటమితో చంద్రబాబు ఇప్పుడు ఏం చేయాలో అర్థంకాని గందరగోళంలో పడిపోయారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంగళగిరి నియోజకవర్గం నుంచి లోకేశ్‌ ను పోటీ చేయించాలని నిర్ణయించిన తర్వాత జనసేన అక్కడి నుంచి పోటీ చేయకుండా తప్పుకుంది. జనసేన పొత్తు పేరుతో ఆ స్థానాన్ని సీపీఐకి కేటాయించారు. సామాజిక వర్గం, రాజధాని ప్రాంతం అంటూ అనేక కోణాల్లో విశ్లేషించుకున్న తర్వాతే విజయం సులభమని భావించిన తర్వాతే లోకేశ్‌ ను అక్కడి నుంచి పోటీ చేయించాలని చంద్రబాబు నిర్ణయించారు. లోకేశ్‌ కోసం అత్యంత శ్రేయోస్కరమైన నియోజకవర్గం ఏదవుతుందోనని అనేక విధాలుగా సర్వేలు చేయించిన తర్వాత భీమిలి, మంగళగిరి నియోజకవర్గాల నుంచి పోటీ చేయించడం మంచిదని చంద్రబాబు నిర్ణయానికొచ్చారు. చివరగా మంగళగిరిని ఎంపిక చేసుకున్నారు. 

ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి ఆర్కే గట్టి పోటీనివ్వడంతో లోకేశ్‌ తన అధికార శక్తియుక్తులన్నీ ప్రయోగించారు. ఎన్నికల్లో పూర్తి సమయాన్ని వెచ్చించారు. ఆర్థిక అంగబలాన్నంతా ప్రయోగించారని వార్తలొచ్చాయి. తెలుగుదేశం పార్టీ బాధ్యతలను అప్పగించాలనుకున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సైతం ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతిరోజూ నియోజకవర్గం నేతలతో సమాలోచనలు జరిపారు. ఇంత చేసినప్పటికీ చివరికి ఓటమి పాలవ్వడంతో చంద్రబాబుతో పాటు ఆయన సన్నిహితులు తీవ్ర నిరాశలో మునిగిపోయారని పార్టీ వర్గాలు చెప్పాయి. నాయకత్వం వహించే విషయంలో మొదటి నుంచీ లోకేశ్‌ పై సొంత పార్టీ నుంచే విమర్శలు వ్యక్తమైనప్పటికీ చంద్రబాబు నాయుడు కుమారుడు కావడంతో పార్టీ నాయకులెవరూ బహిరంగంగా మాట్లాడలేకపోయారు. తాజా ఎన్నికల్లో ఘోర పరాజయం ఆ పార్టీ నేతలు ఒకరకమైన గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇకపోతే, ప్రస్తుతం శాసనమండలికి ప్రాతినిథ్యం వహిస్తున్న లోకేశ్‌ ను ప్రజలు తిరస్కరించిన నేపథ్యంలో తాజా ఓటమికి నైతిక బాధ్యత వహించి ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పుకుంటారా? లేక కొనసాగుతారా? అన్నది ఇప్పుడే చెప్పలేమని ఆయన సన్నిహితుడొకరు చెప్పారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top